చినవంకలో కూటమికి జన జాతర.
చినవంకలో కూటమికి జన జాతర.
సర్పంచ్ అభ్యర్థిగా హేంబాబు చౌదరి నామినేషన్ - పోటెత్తిన అన్ని వర్గాల ప్రజలు.
పలాస / వజ్రపుకొత్తూరు, నవంబర్ 16,మేజర్ న్యూస్.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చినవంక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్‌డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దువ్వాడ హేంబాబు చౌదరి నామినేషన్ కార్యక్రమం సోమవారం సందడిగా జరిగింది.వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామ సచివాలయంలో నామినేషన్ ఘట్టానికి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజానీకం భారీ సంఖ్యలో తరలి రావడంతో ఉద్దానం ప్రాంతంలో ఎన్నికల సందడి నెలకొంది.ఉదయం నుంచే గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, సచివాలయం పరిసరాల్లో జనం గుమిగూడారు. అంతకుముందు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వందలాదిమంది "దువ్వాడ హేంబాబు చౌదరి నాయకత్వం వర్ధిల్లాలి, "పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జిందాబాద్", "ముఖ్యమంత్రి చంద్రబాబుకు జై", "జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జై" అంటూ కూటమి శ్రేణుల నినాదాలతో నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.అనంతరం సర్పంచ్ అభ్యర్థి హేంబాబు చౌదరి ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హేంబాబు మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్థాయిలోనూ కొనసాగేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని విజ్ఞప్తి చేశారు.సుదీర్ఘకాలం నుంచి రాజకీయాలకు అతీతంగా, గౌరవం కోసం మాత్రమే తమ కుటుంబ సభ్యులు సర్పంచులుగా సేవలు అందించి, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని గుర్తు చేశారు.ముఖ్యంగా అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్ సౌకర్యంతో పాటు శాశ్వత గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించామని, ఏ గ్రామానికి అన్యాయం జరగకుండా, ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధిని అందరికీ చేరువ చేశామని, ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు.రాజకీయాలు అంటే ప్రజల మనసులను గెలుచుకోవాలి తప్ప, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయడానికి బలవంతంగా ప్రమాణాలు చేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలడో ప్రజలు ఆలోచించాలన్నారు.ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత, రైతులకు అండ, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సహాయ సహకారంతో మూడు గ్రామాలను సమానంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా చినవంకను తీర్చిదిద్దుతామని, తనకు సర్పంచ్ గా ప్రజలు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.