నామినేషన్ కేంద్రాల్లో వసతులపై ఆరా
మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మండలంలోని 10వ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్, తహసీల్దార్ టి. రాము మంగళవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మర్రిపాడు-సి, పెద్దలక్ష్మీపురం, గొప్పిలి, మెలియాపుట్టి, కోసమాల, పెద్ద పద్మాపురం తదితర గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి, నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. అభ్యర్థులు, ప్రతిపాదకులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేయాలని, అవసరమైన గదులు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్ణీత నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఎంపీడీవో అప్పయ్య, ఎంఈవో పద్మనాభరావు, పంచాయతీ కార్యదర్శులు శివాజీ, మోహన్‌రావు, ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.