ఈ నెల 21న స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
• చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంపై న్యాయవాదులకు జడ్జి బి. కృష్ణ తేజ సూచనలు
సూర్య, లక్షెట్టిపేట :
ఈ నెల 21న నిర్వహించనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని లక్షెట్టిపేట కోర్టు ఇన్‌చార్జి జూనియర్ సివిల్ జడ్జి బి. కృష్ణ తేజ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు అవకాశం కల్పించాలని సూచించారు.
స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో గురువారం లక్షెట్టిపేట కోర్టులో న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి బి. కృష్ణ తేజ మాట్లాడుతూ.. ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కేసులకు సంబంధించి న్యాయవాదులు తీసుకోవాల్సిన చర్యలు, కక్షిదారులకు అందించాల్సిన అవగాహనపై బార్ అసోసియేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు.
కోర్టు పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి, ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసుల పరిష్కారం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 21న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి. పద్మ, కార్యదర్శి వి. సత్యం, సీనియర్ న్యాయవాదులు ఈ. రాజేశ్వరరావు, అక్కల శ్రీధర్, గడికొప్పుల కిరణ్ కుమార్, నలినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.