గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ
**గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!**
- గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ
-
- ప్రాజెక్టు విస్తరణకు అనుకూలంగా అభిప్రాయాలు తెలిపిన గ్రామస్థులు, ఎన్జీవోలు.
- గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి,
- ప్రజల అవసరాలను దశలవారీగా పరిష్కరిస్తామన్న గ్రీన్‌కో ప్రతినిధులు
**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**
మండల పరిధిలోని గుమ్మితం తండాలో గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,200 మెగావాట్ల నుంచి 1,680 మెగావాట్లకు పెంచే ప్రతిపాదనపై గురువారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టు విస్తరణ, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి, పరిసర గ్రామాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దిగువ జలాశయానికి బండ్ నిర్మాణం చేపట్టడంతో పాటు టర్బైన్ల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రాజెక్టు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,680 మెగావాట్లకు పెంచేందుకు ప్రతిపాదించినట్లు వివరించారు. పర్యావరణ ప్రభావ అంచనాలో భాగంగా గాలి నాణ్యత, ఉపరితల జలాలు, భూగర్భ జలాల నాణ్యతపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిసరాల్లో 30 కిలోమీటర్ల పరిధిలోని 10 గ్రామాల్లో పర్యావరణ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు.పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలు–2006 ప్రకారం ప్రాజెక్టు విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరని, ప్రజలు తెలియజేసే అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను సంబంధిత పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయాలని కోరారు.
**భవిష్యత్ తరాలకు ఉపయోగకరం.. ప్రాజెక్టు విస్తరణకు గ్రామస్థుల మద్దతు**
ప్రజాభిప్రాయ సేకరణలో సుమారు గ్రామస్థులు మాట్లాడి ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే గ్రీన్‌కో సంస్థ పరిసర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరింత పెంచడం వల్ల రాబోయే రోజుల్లో గ్రామాలకు మరిన్ని అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. తాగునీరు, రహదారులు, విద్య, వైద్య సదుపాయాల కల్పనలో సంస్థ అందిస్తున్న సహకారాన్ని ప్రస్తావిస్తూ ప్రాజెక్టు విస్తరణకు అనుకూలంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.
** స్కిల్ డెవలప్మెంట్ గ్రామాల అభివృద్ధి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు చేపట్టాలి.. ఎన్జీవోల సూచన**
ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఎన్జీవో ప్రతినిధులు ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలుస్కిల్ డెవలప్మెంట్ గ్రామాల అభివృద్ధి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి సంస్థ మరింత ప్రాధాన్యం ఇస్తూ, స్థానిక సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని కోరారు. అదే సమయంలో ప్రాజెక్టు కార్యకలాపాల వల్ల ఎలాంటి కాలుష్యం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గాలి, నీరు, నేల నాణ్యతకు నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
**ప్రజల అవసరాలను దశలవారీగా పరిష్కరిస్తాం.. గ్రీన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు*
సమావేశంలో గ్రామస్థులు, ఎన్జీవో ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలు, అభివృద్ధి అవసరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సంస్థ పరిధిలో సాధ్యమయ్యే కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా అమలు చేసేందుకు కృషి చేస్తామని గ్రీన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. గుమ్మితం తండా గ్రామాన్ని తమ సొంత గ్రామంగా భావిస్తున్నామని, ప్రాజెక్టు ప్రారంభం నుంచి గ్రామస్థుల నుంచి మంచి సహకారం లభిస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను కలెక్టర్‌తో చర్చించి సాధ్యమైన మేరకు అందిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రమేష్, ఈఈ కిషోర్ రెడ్డి, ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్, గ్రీన్‌కో సంస్థ డైరెక్టర్ శ్రీనివాసులు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసనాయుడు, గ్రీన్ కోసిబ్బంది వివిధ గ్రామాల ప్రజలు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.