ఉత్కంఠకు తెర.. తాడిమర్రి ఎంపీపీగా కూచి నాగవేణి ఎన్నిక! తెరవెనుక రాజకీయ సమీకరణాలకు చెక్.. ఐదుగురు టీడీపీ ఎంపీటీసీల ఐక్యతతో దక్కిన ఎంపీపీ పీఠం
తాడిమర్రి సూర్య రిపోర్టర్ :- తాడిమర్రి మండల పరిషత్ అధ్యక్షురాలి ఎన్నిక తీవ్ర ఉత్కంఠ, అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ముగిసింది. రాత్రికి రాత్రే మారిన రాజకీయ సమీకరణాలు, తెరవెనుక సాగిన మంతనాలు, కూటమి ధర్మం పేరుతో జరిగిన ప్రయత్నాల నడుమ చివరకు టీడీపీ ఎంపీటీసీల ఐక్యత విజయం సాధించింది. ఐదు ఎంపీటీసీ స్థానాలతో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూచి నాగవేణి ఎంపీపీగా ఎన్నికై సత్తా చాటారు. తాడిమర్రి మండలంలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో టీడీపీ ఐదు స్థానాలు, వైఎస్సార్సీపీ మూడు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీంతో ఎంపీపీ పదవి టీడీపీకి దక్కడం ఖాయమని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున కూచి నాగవేణి పేరు ఎంపీపీ అభ్యర్థిగా ఖరారైంది. అయితే చివరి నిమిషంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. వైఎస్సార్సీపీ, బీజేపీ ఎంపీటీసీల మధ్య అంతర్గతంగా సమన్వయం కుదిరి, పెద్దకోట్ల ఎంపీటీసీ అభ్యర్థి. నాగరత్నమ్మను ఎంపీపీగా ఎన్నుకునేందుకు తెరవెనుక రాజకీయ వ్యూహాలు సిద్ధమైనట్లు ప్రచారం సాగింది. మరోవైపు కూటమి ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో బీజేపీ అభ్యర్థికి బీఫారం అందించినట్లు తెలిసింది. ఈ పరిణామాలు ఐదు స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఎంపీటీసీలకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ప్రజల ఆదరణతో కష్టపడి గెలిచిన తమకు కాకుండా ఇతర రాజకీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ అంతర్గత నిర్ణయాలకు అతీతంగా తమ బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జరిగిన బలపరీక్షలో టీడీపీ ఎంపీటీసీలు ఐక్యంగా నిలిచారు. కూచి నాగవేణికి ఐదుగురు ఎంపీటీసీలు చేతులెత్తి మద్దతు ప్రకటించారు. వీరిలో నార్సింపల్లి ఎంపీటీసీ బీదాల ఈశ్వరమ్మ, సీసీ రేవు ఎంపీటీసీ మేడికొండ నారాయణస్వామి, కునుకుంట్ల ఎంపీటీసీ గవిరెడ్డి పద్మావతి, చిల్లకొండయ్యపల్లి ఎంపీటీసీ దాసగానపల్లి బాల నరసింహుడు తమ మద్దతు ప్రకటించడంతో పాటు మిగిలిన టీడీపీ ఎంపీటీసీ కూడా కూచి నాగవేణికి అండగా నిలిచారు. మరోవైపు రెండో అభ్యర్థిగా నాగరత్నమ్మ పేరును ప్రతిపాదించగా, ఆమెతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు కలిపి నలుగురు మద్దతు తెలిపారు. దీంతో మొత్తం తొమ్మిది మంది సభ్యుల్లో ఐదుగురి స్పష్టమైన మెజారిటీ సాధించిన కూచి నాగవేణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అదే విధంగా వైస్ ఎంపీపీగా జి. పద్మావతమ్మ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎంపీడీవో శ్రీనివాసులు, వెంకట రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. తెరవెనుక ఎన్ని రాజకీయ ఎత్తులు, పైఎత్తులు సాగినా చివరకు ఐక్యత ముందు అవి నిలవలేకపోయాయి. ఐదు స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఎంపీటీసీలు చివరి వరకు ఒకే మాటపై నిలబడటంతో ఎంపీపీ పీఠం కూచి నాగవేణిని వరించింది. తాడిమర్రి మండల రాజకీయాల్లో ఈ ఎంపీపీ ఎన్నిక ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజల తీర్పు, ఎంపీటీసీల ఐక్యత, చివరి నిమిషంలో మారిన రాజకీయ సమీకరణాలు ఈ ఎన్నికను ప్రత్యేకంగా నిలిపాయి.