ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి
నవాబుపేట, మేజర్ న్యూస్: దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామా వెంకటరెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవాబుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1917 నవంబర్ 19న జన్మించిన ఇందిరా గాంధీ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని తెలిపారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. 1971 యుద్ధ సమయంలో దేశానికి నాయకత్వం వహించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదపడ్డారని, దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1972లో భారతరత్న పురస్కారం అందుకున్నారని గుర్తుచేశారు. ఆమె జీవిత చరిత్ర, రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవా స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేడిపల్లి వెంకటయ్య, మండల కాంగ్రెస్ నాయకులు సామా వెంకటరెడ్డి, నవాబుపేట సర్పంచుల సంఘం అధ్యక్షుడు, ఎల్లకొండ సర్పంచ్ కొండల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలారి శేఖర్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.