సత్య ప్రభ సేవలు చిరస్మరణీయం విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో విశేష కృషి – ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
శ్రీనివాస ట్రస్ట్ అధ్యక్షురాలు, మాజీ శాసనమండలి సభ్యురాలు డి.ఏ. సత్య ప్రభ ఏడవ వర్ధంతిని చిత్తూరులోని రుక్మిణి కృష్ణస్వామి విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్మరణ సభలో అధ్యాపకులు, విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు మాట్లాడుతూ డి.ఏ. సత్య ప్రభ చేసిన సేవలు చిత్తూరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ప్రజల దాహార్తిని తీర్చిన జలదాత్రిగా, పేద విద్యార్థులకు విద్య అందించేందుకు తెలుగు విద్యాలయాలను నిర్మించిన విద్యాదాత్రిగా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాణ్యమైన వైద్యశాలను నిర్మించిన ఆరోగ్య ప్రదాత్రిగా ఆమె సేవలు మరువలేనివని పేర్కొన్నారు.విద్య, వైద్యం, తాగునీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఆమె జీవితాంతం విశేష కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఆమె అందించిన సేవలు ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ఆమె ఆశయాలు, సేవా స్ఫూర్తిని నేటి తరానికి అందించి, ఆమె చూపిన మార్గంలో ముందుకు సాగడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.అనంతరం సభకు హాజరైన వారంతా నిలబడి ఆమె సేవలను స్మరించుకున్నారు. అధ్యాపక బృందం సత్య ప్రభ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది.
వర్ధంతిని పురస్కరించుకొని తపోవనం వృద్ధాశ్రమం, నిరాశ్రయుల ఆశ్రయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నిరాశ్రయులకు భోజనం అందించి సేవా కార్యక్రమం చేపట్టారు. సమాజ సేవే లక్ష్యంగా సత్య ప్రభ సాగించిన జీవితాన్ని స్మరించుకుంటూ ఆమె సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్