విత్తనోత్పత్తితో రైతన్నకు అదనపు ఆదాయం
— కొత్తపల్లి రైతు బాలరెడ్డి అందరికీ ఆదర్శం
మాగనూర్ సూర్య న్యూస్ :
నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్వీకే), నారాయణపేట ఆధ్వర్యంలో వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విత్తనోత్పత్తి మెలకువలపై అవగాహన పెంచుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్వీకే సమన్వయకర్త డాక్టర్ ఈటెల సత్యనారాయణ,ఏఓ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ.. వరి విత్తనోత్పత్తి ప్రాముఖ్యత, నాణ్యమైన విత్తనాల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విత్తనోత్పత్తి ద్వారా రైతులకు లభించే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. నాణ్యమైన విత్తనోత్పత్తి రైతులకు అదనపు ఆదాయ మార్గంగా నిలవడమే కాకుండా, గ్రామస్థాయిలోనే నాణ్యమైన విత్తనాలు సులభంగా అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలను తోటి రైతులకు చేరవేయడం ద్వారా విత్తనోత్పత్తిని మరింత విస్తరిస్తామని తెలిపారు.ముఖ్యంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బాలరెడ్డి విత్తనోత్పత్తిపై తన అనుభవాలను ఇతర రైతులతో పంచుకున్నారు.తాను మూడు ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ 15048 వరి రకంతో చేపట్టిన విత్తనోత్పత్తి సాగు విధానం, పంట నిర్వహణ, విత్తన స్వచ్ఛత కోసం పాటించిన పద్ధతులను వివరంగా తెలియజేశారు. అనంతరం హాజరైన రైతులందరూ బాలరెడ్డి సాగు చేసిన మూడు ఎకరాల విత్తనోత్పత్తి క్షేత్రాన్ని స్వయంగా సందర్శించి పంట స్థితిని, నిర్వహణ తీరును పరిశీలించారు. క్షేత్ర ప్రదర్శనలో చూసిన పంట తీరు, బాలరెడ్డి అనుభవాలతో పలువురు రైతులు వచ్చే సాగు సీజన్‌లో తాము కూడా వరి విత్తనోత్పత్తి చేపట్టేందుకు ఆసక్తి కనబరచడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ నారాయణపేట జిల్లా డీడీఎం మహేందర్, మాగనూర్ మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్, ఏఈఓ అపర్ణ, మాగనూరు పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, రైతు బాలరెడ్డి , గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంజనేయులు , సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం