ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ పట్టభద్రం
సూర్య జాతీయ డెస్క్: విదేశాలలో భారత ఉన్నత విద్యా విస్తరణలో ఒక కీలక మైలురాయిగా ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ విద్యార్థులు పట్టభద్రులయ్యారు. ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీలో ఎంటెక్ పూర్తి చేసిన 17 మంది తొలి బ్యాచ్ విద్యార్థుల కోసం అబుదాబిలో నిర్వహించిన స్నాతకోత్సవానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఐఐటీ ఢిల్లీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్ హరీష్ సాల్వే, ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ, ఐఐటీ ఢిల్లీ అబుదాబి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను రాయ్ హాజరయ్యారు. వీరితో పాటు యూఏఈ ఎగ్జిక్యూటివ్ అఫైర్స్ అథారిటీ స్ట్రాటజిక్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీమా అల్ మొకర్రబ్, యూఏఈలో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ మరియు ఇరు దేశాల విద్యావేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్‌లో 2024 జనవరిలో ప్రారంభమైన తొలి కోర్సు ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీలో ఎంటెక్. కోర్సులో భాగంగా తొలి బ్యాచ్ విద్యార్థులు కార్బన్ క్యాప్చర్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, ఇంధన మార్కెట్లు, మీథేన్ వంటి ఇంధన రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ బ్యాచ్‌లో అద్నాన్ అబూద్ హజ్సలేమ్ సలేహ్ నాగా అనే విద్యార్థి 10 జీపీఏ సాధించి విద్యా ప్రతిభకు గాను స్వర్ణ పతకాన్ని అందుకున్నారు.
యూఏఈలో ఐఐటీ ఏర్పాటు నిర్ణయం 2022 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అప్పటి అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్నారు. అనంతరం 2023 జూలైలో ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా భారత విద్యా మంత్రిత్వ శాఖ, ఐఐటీ ఢిల్లీ, అబుదాబి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్‌లో ఆరు ప్రోగ్రాములు అందుబాటులో ఉండగా, 13 జాతీయతలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు విద్యనభ్యసిస్తున్నారు. ఎంటెక్ కోర్సుతో పాటు ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ కూడా నడుస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులు కొనసాగుతున్నాయి.