చిత్తూరు రూరల్‌లో నూతన పాలన.. అధ్యక్షుడిగా జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా లావణ్య
చిత్తూరు అర్బన్ మేజర్ న్యూస్: చిత్తూరు రూరల్ మండలానికి సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించగా, మండల అధ్యక్షుడిగా ముత్తుకూరు ఎంపీటీసీ సభ్యుడు ఆర్. జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా తుమ్మిందా ఎంపీటీసీ సభ్యురాలు సి. లావణ్య ఎన్నికయ్యారు.చిత్తూరు రూరల్ మండల పరిధిలో అనంతాపురం నుంచి టి. జ్యోతి, చర్లోపల్లి నుంచి మరిముత్తు, దిగువ మాసపల్లి నుంచి మంజుష్ కుమార్, ముత్తుకూరు నుంచి ఆర్. జయచంద్ర నాయుడు, తాళంబేడు నుంచి కే. రమేష్, తప్పాతిపల్లి నుంచి కే. నవనీత, తుమ్మిందా నుంచి సి. లావణ్య టీడీపీ నుంచి ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. పచ్చనపల్లి నుంచి వి. జీవనజ్యోతి వడగల వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఆర్. జయచంద్ర నాయుడు మాట్లాడుతూ నాపై నమ్మకంతో మద్దతు తెలిపిన ఎంపీటీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలిపారు. ప్రజలు చెప్పే సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. మండలాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఉపాధ్యక్షురాలు సి. లావణ్య మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్య సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అధ్యక్షుడితో కలిసి మండల అభివృద్ధి కోసం జట్టుగా పని చేస్తానని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శకంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.ఈ విధంగా చిత్తూరు రూరల్ మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్