బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు
సూర్య జాతీయ డెస్క్: పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ చెల్లుబాటు కాలాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త బీఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు పునరుద్ధరణ వ్యవధిని పొడిగిస్తూ, పాత వాహనాలకు మాత్రం తక్కువ చెల్లుబాటు కాలాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నవంబర్ 13న ఈ మేరకు కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. 1988 మోటారు వాహనాల చట్టం కింద సెంట్రల్ మోటారు వెహికల్స్ పదహారో సవరణ నిబంధనలు 2026 ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే ఇవి వర్తిస్తాయి.
కొత్త నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాల లోపు వయసున్న ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ మూడేళ్లకు ఒకసారి అవసరం అవుతుంది. ఆరు ఏళ్లు దాటి పది సంవత్సరాలలోపు ఉన్న ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు ఏటా పునరుద్ధరణ తప్పనిసరి చేశారు. పది సంవత్సరాలు దాటిన ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్టిఫికెట్ పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
రవాణా వాహనాల విషయంలోనూ బీఎస్-6 ప్రమాణాలకు లోబడి ఉన్న వాటికి గడువును పొడిగించారు. ఆరు సంవత్సరాల లోపు ఉన్న రవాణా వాహనాలకు రెండేళ్లకు ఒకసారి, ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య ఉన్న వాటికి ఏడాదికి ఒకసారి పీయూసీ పునరుద్ధరించుకోవాలి. పది సంవత్సరాలు దాటిన రవాణా వాహనాలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీ తప్పనిసరిగా ఉంటుంది. ఇక బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 ప్రమాణాల వాహనాలకు మూడు నెలల పాటు, బీఎస్-4 వాహనాలకు ఆరు నెలల పాటు పీయూసీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది.
సర్టిఫికెట్ పునరుద్ధరణ అమల్లోకి వచ్చే తేదీపై కూడా సవరించిన నిబంధనలలో స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత సర్టిఫికెట్ గడువు ముగియడానికి పది రోజుల ముందు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంటే, పాత సర్టిఫికెట్ గడువు ముగిసిన తేదీ నుంచే కొత్తది అమల్లోకి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ చేపడితే, పునరుద్ధరించిన రోజు నుంచే కొత్త సర్టిఫికెట్ వర్తిస్తుంది. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందు జారీ చేసిన సర్టిఫికెట్లకు, నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పునరుద్ధరణ జరిపినప్పటి నుంచే ఈ సవరించిన గడువు నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.