పెంగరగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి పలమనేరు–గుడియాత్తం రహదారిపై వరి ఆరబెడుతుండగా దూసుకొచ్చిన కారు
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబెడుతున్న ముగ్గురు మహిళలపైకి కారు దూసుకెళ్లడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పెంగరగుంట గ్రామంలో విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో గుడియాత్తం నుంచి పలమనేరు వైపు వస్తున్న కారు, పలమనేరు–గుడియాత్తం రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ కూర్చున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి మహిళలపైకి దూసుకెళ్లడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సాలమ్మ (70) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు మహిళలు జ్యోతి లక్ష్మి (50), మునెమ్మ (50)లను చికిత్స తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.మృతులను పెంగరగుంట గ్రామానికి చెందిన సాలమ్మ, మునస్వామి భార్యగా, ఆర్. జ్యోతి లక్ష్మి , వేణు అలియాస్ చిట్టి భార్యగా, మునెమ్మ, రాజేంద్ర భార్యగా గుర్తించారు. ముగ్గురి మృతదేహాలను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకితరలించారు.ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు కమాండ్ కంట్రోల్ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కారు నంబర్, డ్రైవర్ వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.ముగ్గురు మహిళలు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్