ఇదే ఉత్సాహంతో పనిచేయాలి.. 2029లోనూ కూటమిదే విజయం కావాలి
నెల్లూరు, మేజర్ న్యూస్ : దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లాలో 35 జడ్పీటీసీ స్థానాలకు గాను 33 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 25 ఏళ్ల తర్వాత జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడం జిల్లాలో పార్టీకి లభించిన ముఖ్యమైన విజయమన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. 2029 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రజలకు మరింత చేరువ కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఫలితాలను 2029 ఎన్నికల్లోనూ పునరావృతం చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.