నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, గుంటూరు, చిత్తూరు తదితర మెట్ట జిల్లాలకు సంబంధించిన దశాబ్దాలు తరబడి ఊరిస్తున్న నడికుడి- శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి ఎప్పటికి సాధిస్తుందో,ఈ తరం వారు ఈ మార్గంలో రైలు కూత వింటారో లేదో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం 2021 నాటికి పూర్తయ్యేలా ప్రభుత్వాలు నిర్ణయించినా ఈ రైల్వే లైన్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం 2020-21 బడ్జెట్లో రాష్ట్ర వాటాగా నిధులు కేటాయింపు జరగలేదని ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ కు అత్యంత ఆశ్చర్యకరంగా 1500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. 2022 -23 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో 2002 కోట్ల రూపాయలు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో 450 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని చెబుతున్నారు.అయితే సమవాటాగా రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తం కేటాయించాల్సి ఉండగా గత బడ్జెట్లో గమనించాక ఈదపా కూడా బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడం వలన నిరాశ గానే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఈ రైల్వే లైను గురించి అన్ని పార్టీల నాయకులు అనూహ్యంగా ప్రాధాన్యత హామీలు ఇస్తుంటారు తప్ప అనంతరం ఆధ్యాస కూడా ఉండడం లేదని కూడా పలువురు చర్చించుకుంటూ ఉంటారు.ఈ తరంలో పెద్దవాళ్లయితే తాము ఈ మార్గంలో రైలు చూడబోమని అంటుంటారు. అయితే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బడ్జెట్ అనగానే ఈ దపా మరింత ప్రాధాన్యత లభిస్తుందేమో అంటూ కొండంత ఆశలు పెట్టుకోవడం, అనంతరం నిరాశ చెందడం పరిపాటిగా ఉంది. అనాదిగా నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎంపీలు రావడం ఇతర ప్రాంతాల్లో కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా ఉండడం, వారు అనేక దపాలుగా హామీలు ఇవ్వడం తమ వంతుగా వారు గతంలో ప్రయత్నాలు చేసి ఉండడం తెలిసిందే.2010 నుండి బడ్జెట్లో ఆశించిన మేరకు నిధులు కేటాయించినందున ఈ రైల్వే లైన్ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొంతవరకు వేగంగా పనులు జరిగినా నెల్లూరు జిల్లాలో భూసేకరణకు నిధులు కేటాయించలేదని అరాకొరా పనులు మాత్రమే జరుగుతున్నందున రైల్వే లైన్ నిర్మాణం నిరాశ జనకంగా ఉందని పలువురు భావిస్తుంటారు. మెట్ట ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాల కలగా ఉన్నా నడికుడి- శ్రీకాళహస్తి రైలు మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదంటూ ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆందోళన కూడా చేయడం, మూడేళ్ల క్రితం ఆమరణ నిరాహార దీక్ష కూడా చెపట్టగా అధికారులు తాత్కాలికంగా హామీ ఇచ్చి విరమింపజేయడం తెలిసిందే. ఆయన మాత్రం ఈ రైల్వే లైన్ పూర్తి చేయాలంటూ తన వంతుగా పోరాటాలు సాగించారు. ఆత్మకూరు ఆశలు తీరేది ఎన్నటికో నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గంపై ఆత్మకూరు ప్రాంత ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు.మెట్ట ప్రాంతమైనందున రైలు మార్గంలో అభివృద్ధి జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజల్లో గంపెడాశలు ఉన్నాయి. నాలుగు జిల్లాల మెట్ట ప్రాంత ప్రజల ఆశాజనకమైనది ఈ రైలు మార్గం అంటుంటారు. ఈ రైలు మార్గం ప్రతిపాదనలో తొలిదశ 45.5 కిలోమీటర్లు పిడుగురాళ్ల సేవల్యాపురం, రెండో దశగా 41.95 కిలోమీటర్లు గుండ్లకమ్మ దర్శి వెంకటగిరి ఆల్తూరుపాడు, మూడో దశగా 95.5 కిలోమీటర్లు దర్శి కనిగిరి, వెంకటాపురం, నాలుగో దశగా 126.16 కిలోమీటర్లు కనిగిరి ఓబులాయిపల్లి వెంకటాపురంలు గా నిర్ణయించి 160 వంతెనలు, 28 ఆర్ వో వీలు, 144 ఆర్ ఈ బిలు,పిడుగురాళ్ల, శావల్యాపురం, వినుకొండ, వెంకటగిరి రైల్వేస్టేషన్ల తోపాటు నూతనంగా నకిరేకలు, రొంపిచర్ల, వినుకొండ,దర్శి,పొదిలి, గౌతువారి పల్లి, కనిగిరి, బలిపల్లి, పామూరు, గొల్లవారి పల్లి,వింజమూరు, ఆత్మకూరు, ఓబులాయపల్లి, వెంకటాపురం, ఆదురుపల్లి, రాపూరు, వెల్లంపల్లిలలో స్టేషన్లను నిర్మించేలా నిర్ణయించారు.గతంలో పనబాక లక్ష్మి కేంద్రమంత్రిగా, ఎంపీలుగా మేకపాటి రాజమోహన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, చింతామోహన్, గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీలు ఈ రైలు మార్గం గురించి పలు దపాలు పార్లమెంట్లో చర్చించారు. నిధులు కేటాయించాలని పూర్తి చేయాలని కోరారు. తమ వంతుగా వాణి విన్పించారు. గుంటూరు జిల్లా నడికుడి నుండి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు ఈ రైలు మార్గం నిర్మిస్తే మెట్ట ప్రాంతాలైన కారంపూడి, వినుకొండ, కురిచేడు, దర్శి, పొదిలి, కనిగిరి,పామూరు, వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, ఆత్మకూరు, పొదలకూరు,రాపూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల మీద రైలు మార్గ నిర్మాణం బహుళ ప్రయోజనకరమని అందరు భావిస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ రైలు మార్గంలో రైలు రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండబోదని,తిరుపతి చెన్నైలకు రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని, దూరం తగ్గడం జరుగుతుందని, ఈ ప్రాంతాల్లోని మిర్చి,వర్జినియా పొగాకు, నిమ్మ తదితర ఉత్పత్తుల రవాణా సునాయాసంగా ఉంటుందని, తద్వారా గిట్టుబాటు ధరలు లభిస్తాయి అని అందరు భావిస్తుంటారు. కానీ ఎన్ని రైల్వే బడ్జెట్ లు వచ్చినా ఈ రైలు మార్గానికి మోక్షం లభించడం లేదని గత యూపీఏ ప్రభుత్వం బడ్జెట్లో రెండు దపాలు నిధులు కేటాయించినా అనంతరం పట్టించుకులేదని పలువురు విమర్శిస్తుండేవారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులు వెచ్చించాలని నిర్ణయం కాగా ఆ ప్రకారం రెండు ప్రభుత్వాలు భూసేకరణకు నిర్మాణ పనులకు నిధులు సమకూర్చనందునే జాప్యం జరుగుతుందని సర్వత్రా భావిస్తున్నారు. మెట్ట ప్రాంత ప్రజలకు వరప్రసాదం నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మించడం మెట్ట ప్రాంతాలకు వరంగా అందరు భావిస్తుంటారు. 420 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గం నిర్మిస్తే హైదరాబాదు,చెన్నై, తిరుపతి మధ్య దూరం బాగా తగ్గుతుందని, 1983లో రైల్వే శాఖ ఈ రైలు మార్గం గురించి ప్రాథమిక సర్వే జరిపి 170 కోట్ల రూపాయలు అంచనా వేశారు. ఈ అంచనాలు ఏళ్లు గడిచాక విపరీతంగా పెరిగి గత ఎన్నికల నాటికి 1314 కోట్లకు పెరిగి నేడు 2298 కోట్లకి చేరుకుందని చెబుతున్నారు. ప్రస్తుతమైతే ఇంకా జాప్యం జరిగితే మరింతగా పెరుగుతుందని చెబుతుంటారు. ఈ రైలు మార్గం పూర్తయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని,ఇతర ప్రాంతాల వారికి ప్రయాణభారం తగ్గుతుందని, ఈ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సౌకర్యం పెరుగుతుందని, ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తుంటారు. కానీ గత కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయింపు నిరాశ మిగల్చగా కేంద్ర బడ్జెట్లో 2018 -19లో 750 కోట్లు, 2019- 20లో 1198 కోట్లు, 2020-21లో 1501 కోట్లు, 2023 -24 లో 220కోట్లు, 2024-25లో 450 కోట్లు రూపాయలు కేటాయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించనందున పురోగతి సాధించే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అన్ని సర్వేలు గత ప్రభుత్వంలో వేగవంతంగా నిర్వహించి అన్ని సిద్ధం చేయగా నిధులు లేనందున భూసేకరణ జరగలేదని భావిస్తున్నారు. ఇప్పటికైనా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం,చిత్తూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి నడికుడి రైలు మార్గం ఏర్పాటుకు తగినంతగా నిధులు రాబట్టి వేగవంతంగా పనులు పూర్తి చేయించి ఈ ప్రాంతాల ప్రజలకు రైలు యోగం కల్పించాలని సర్వత్రా కోరుతున్నారు.