ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు!
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు!
- మూడు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 139, వార్డులకు 487 నామినేషన్లు
- చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 70, వార్డులకు 217 దాఖలు
- నన్నూరులో సర్పంచ్ స్థానంపై టీడీపీ వర్గాల మధ్య పోటీ
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు మూడు రోజుల్లో 139 నామినేషన్లు, 220 వార్డు సభ్యుల స్థానాలకు 487 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో నాగ అనసూయ తెలిపారు.
మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 13, వార్డు సభ్యుల స్థానాలకు 36 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 56, వార్డు సభ్యుల స్థానాలకు 234 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం సర్పంచ్ స్థానాలకు 70, వార్డు సభ్యుల స్థానాలకు 217 నామినేషన్లు దాఖలయ్యాయి.
నన్నూరులో ఏకగ్రీవాలపై చర్చ
నన్నూరు గ్రామంలోని 16 వార్డు సభ్యుల స్థానాలకు టీడీపీ తరఫున ఎనిమిది మంది, వైసీపీ తరఫున ఏడుగురు, సీపీఎం తరఫున ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతి వార్డుకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అన్ని వార్డులు ఏకగ్రీవం కానున్నాయనే చర్చ సాగుతోంది. అయితే నామినేషన్ల పరిశీలన అనంతరమే దీనిపై స్పష్టత రానుంది.
మరోవైపు సర్పంచ్ స్థానానికి వైసీపీ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. కూటమి బలపరిచిన అభ్యర్థిగా శ్రీపతి బుజ్జప్ప సతీమణి రూపావాణి నామినేషన్ వేశారు. టీడీపీలోని బైరెడ్డి వర్గానికి చెందిన ఖలీల్ తన భార్య మునవర్ బేగంను రెబల్ అభ్యర్థిగా మొదటి రోజే బరిలోకి దించారు. దీంతో నన్నూరులో సర్పంచ్ స్థానానికి టీడీపీలోని రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది.
ఏకగ్రీవం కోసం రాజీ ప్రయత్నాలు
నన్నూరు సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఓ అధికారి కూడా చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి నాయకులు ఖలీల్‌తో చర్చలు జరుపుతూ ఆయన భార్య మునవర్ బేగం నామినేషన్ ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయత్నాలు ఫలించి మునవర్ బేగం నామినేషన్ ఉపసంహరించుకుంటారా? లేక పోటీలో కొనసాగుతారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.