telangana
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం ఉండకూడదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీమా నమోదు తీరును పరిశీలించారు. బీమా నమోదు ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీమా చేయు వ్యక్తి పేరు, నామినీ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పులు చేయకూడదన్నారు. ప్రక్రియ పూర్తి చేసిన వారి వివరాలు రిజిస్టర్ లో స్పష్టంగా పొందుపరిచాలని చెప్పారు. బీమా నమోదు ప్రక్రియలో ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు కలిగితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. శిబిరాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ తనిఖీలో తహసీల్దార్ ప్రభాకర్, ఎంపిడిఓ సుధాకర్, సర్పంచ్ సుప్రియ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.