జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్
ముత్తుకూరు , మేజర్ న్యూస్ : జన సందోహం మధ్య పంటపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక పద్మ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత గ్రామంలోని సీతారాముల ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రి కాకాణిగోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు కార్యకర్తల సహకారం, గ్రామస్తుల అండదండలతో అట్టహాసంగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశామన్నారు. పంటపాలెం స్వర్ణ గ్రామ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరణ కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను అధికారులకు ఇవ్వడం జరిగింది. జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఆలపాక శ్రీనివాసులు, పార్టీ సీనియర్ నాయకులు మారు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ నాయుడు, దిలీప్, చెంగారెడ్డి , మహిళలు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపారు. గ్రామంలోని బడుగు బలహీన వర్గాల తో పాటు కార్మికులు హాజరు కావడం జరిగింది. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ నామినేషన్ వేశారు. స్థానికంగా నివాసం ఉంటూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాక జనం జేజేలు పలికారు. సర్పంచ్ అభ్యర్థి స్థానంతో పాటు అన్ని వార్డులకు నామినేషన్లు వేశామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు