పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు
నెల్లూరు, మేజర్ న్యూస్ : పంటపాలెం సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని కోరుతూ పారిశ్రామిక వినియోగదారులు శనివారం ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. సుధాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సరఫరా పరిస్థితులు, పరిశ్రమల అవసరాలు, భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ లోడ్ తదితర అంశాలపై ఎస్‌ఈ గారితో చర్చించారు. పరిశ్రమల విస్తరణతో పాటు విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక వినియోగదారులు ఎస్‌ఈ గారి దృష్టికి తీసుకువచ్చారు.
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వినియోగదారులు ఎస్‌ఈ గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్) శ్రీ అల్తాఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ట్రాన్స్‌ఫార్మర్స్) శ్రీ లక్ష్మీనారాయణతో పాటు పంటపాలెం పారిశ్రామిక వినియోగదారులు పాల్గొన్నారు.