నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక
గుంటూరు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు పట్టణ స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికలు – 2026లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరగనుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జి.ఓ.ఎంఎస్. నం.273, ఎంఏ,యూడీ శాఖ (తేది 02-11-2026), రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల అథారిటీ, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ అధీకృతం చేసిన మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ సి.ఎం. సాయికాంత్ వర్మ ప్రిసైడింగ్ అధికారిగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో 76 మంది వార్డు సభ్యులు, మేయర్, 8 మంది ఎక్స్-అఫీషియో సభ్యులతో (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) కలిపి మొత్తం 85 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, సమావేశ నిర్వహణకు 43 మంది సభ్యుల కోరం అవసరమని తెలిపారు. ఉదయం 11 గంటలకు కోరం నిర్ధారణ అనంతరం, తొలుత నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ వెంటనే 76 మంది వార్డు సభ్యులు సామూహికంగా ప్రమాణం స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం రాజకీయ పార్టీల విప్ల ప్రకటన తర్వాత, ప్రత్యక్షంగా ఎన్నికైన వార్డు సభ్యుల నుంచి చేతులెత్తే పద్ధతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారన్నారు. ప్రతి అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదించి, మరొకరు బలపరచాల్సి ఉంటుందని, ఒకవేళ ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేస్తే ఓటింగ్ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి మేయర్‌ను వేదికపైకి ఆహ్వానించి, నూతన డిప్యూటీ మేయర్‌కు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని (డిక్లరేషన్) అందజేస్తారన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకే గుర్తింపు కార్డుల పరిశీలన అనంతరం సభ్యులను కౌన్సిల్ హాలులోకి అనుమతించి హాజరు నమోదు చేస్తారని, ఫారం-ఎ, ఫారం-బి, విప్ ప్రతుల సమర్పణకు ఉదయం 10గంటల వరకు తుది గడువుగా నిర్ణయించార న్నారు. ఉదయం 11:05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు, 11:25 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమై, మధ్యాహ్నం 12:10 గంటల కల్లా సమావేశం ముగిసేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు.సమావేశం కోసం కౌన్సిల్ హాలు లోపల, వెలుపల పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, హాలులో మొత్తం 88 సీట్లను సిద్ధం చేసి, ముందు వరుసను మేయర్, ఎక్స్-అఫీషియో సభ్యులకు కేటాయించామన్నారు. ప్రతి పార్టీకి ప్రత్యేక కంపార్ట్మెంట్లు, డిస్ప్లే బోర్డులతో పాటు మీడియా ప్రతినిధుల కోసం బారికేడ్లతో ప్రత్యేక ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కౌన్సిల్ హాలు చుట్టూ పటిష్టమైన పోలీసు బందోబస్తు, బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, పాస్‌లు ఉన్న నగరపాలక సంస్థ సభ్యులకు మాత్రమే లోపలికి ప్రవేశం కల్పిస్తారన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, పూర్తి పారదర్శకంగా జరిగే ఈ కార్యకలాపాలన్నింటినీ వీడియోగ్రఫీ చేయనున్నట్లు తెలిపారు. సభ్యులందరూ ఉదయం 9 గంటలకల్లా గుర్తింపు కార్డులతో కౌన్సిల్ హాలుకు చేరుకోవాలని, సమావేశం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు, జీఎంసీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సూర్య నాయక్