బీసీల రాజకీయ చైతన్యానికి ఎస్సీలుగా మా మద్దతు కాశపాగ ఇమ్మయ్య
పుల్కల్ ;జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని సంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కాశపాగ ఇమ్మయ్య ఆకాంక్షించారు.అందోల్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పుల్కల్ గ్రామానికి చెందిన లస్కరి ఆంజనేయులును ఆయన శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఇమ్మయ్య మాట్లాడుతూ దేశంలో 52 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీలు రాజకీయంగా మరింత చైతన్యవంతులై, తమ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ జనాభా కలిగిన కొన్ని వర్గాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటూ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు, జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు కూడా సంఘటితమై రాజకీయ రంగంలో ముందుకు సాగాలని సూచించారు.బీసీలు తమ హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా పోరాడాలని,సామాజిక న్యాయం సాధించేందుకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.బీసీలు చేసే ఈ ప్రయత్నంలో ఎస్సీలుగా తాము కూడా అండగా నిలుస్తామని, బీసీల ఉద్యమంలో కలిసి నడుస్తూ అవసరమైన మద్దతు అందిస్తామని ఇమ్మయ్య స్పష్టం చేశారు.బీసీలు,ఎస్సీలు పరస్పర సహకారంతో ఐక్యంగా ముందుకు సాగితే సామాజిక, రాజకీయ రంగాల్లో మరింత బలాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోయిని శ్రీనివాస్,శివరత్నం, పోచయ్య,దిగంబర్,సగ్గల్ల శ్రీనివాస్,డప్పు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.