41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం
కోహిర్;స్వామియే శరణం అయ్యప్ప.. అంటూ అయ్యప్ప నామస్మరణతో భక్తులు ఆధ్యాత్మిక భక్తిలో మునిగిపోతున్నారు. అయ్యప్ప స్వామి మాల ధరించడం, 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టడం ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. నిత్య పూజలు, భజనలు, ఉపవాసాలు, నియమబద్ధమైన జీవన విధానంతో స్వామివారి కృపను పొందేందుకు భక్తులు దీక్షను కొనసాగిస్తారు.ఈ క్రమంలో కోహిర్ మండల పరిధిలోని చింతల్‌ఘాట్ గ్రామానికి చెందిన తమ్మనితోట విజయ్ కుమార్ పాటిల్ ఐదోసారి అయ్యప్ప స్వామి మాల ధరించి భక్తిశ్రద్ధలతో దీక్ష చేపట్టారు. 41 రోజుల పాటు నియమ నిష్ఠలతో అయ్యప్ప స్వామి ఆరాధనలో గడిపి, దీక్షను పూర్తి చేసుకున్నారు.అనంతరం ఇరుముడి కట్టుకొని పవిత్ర శబరిమల యాత్రకు బయలుదేరారు. శబరిమల క్షేత్రంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకొని, నెయ్యాభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకోవాలని సంకల్పించారు. ఐదోసారి స్వామివారి మాల ధరించే భాగ్యం కలగడం పూర్వజన్మల పుణ్యఫలంగా భావిస్తూ, స్వామివారి దివ్య దర్శనం కోసం భక్తితో ఎదురుచూస్తున్నారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు భక్తులు పేర్కొంటున్నారు.