విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
బుచ్చిరెడ్డిపాలెం,మేజర్ న్యూస్ : విద్యార్థులు హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యము, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని మున్సిపల్ కమీషనర్ ఇనమల చిన్నబాబు పేర్కొన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంధాలయంలో ఏర్పాటుచేసిన 59వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన తాసిల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మించే దేవాలయాలు గ్రంథాలయాలని,సెలవు రోజులలో గ్రంథాలయంలో గడిపితే విజ్ఞానం పెరుగుతుందన్నారు. గ్రంధాలయంలో పుస్తకాలు చదవడం వలన పోటీ పరీక్షలకు సులభంగా తయారు కావచ్చన్నారు. ప్రతిరోజు పిల్లలు చిన్ననాటి నుండే పుస్తకాన్ని చదివే అలవాటును ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెంపొందించాలన్నారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రధానం చేశారు. అదేవిధంగా వారోత్సవాలలో గ్రంధాలయానికి లైటింగ్ సమకూర్చిన ఇనుగూరు బాలయ్యను, విద్యార్థులను గ్రంథాలయాలకు అలవాటు చేస్తున్న వార్డెన్ నాగరాజు, గ్రంథాలయాభివృద్ధికి నిరంతరం తపిస్తున్న ఉపాధ్యాయులు, సామాజికవేత్త గండికోట సుధీర్ కుమార్ ను అభినందన జ్ఞాపికలతో అధికారులు సత్కరించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలనాధికారి అల్లాడి నరసింహారావు, మండల విద్యాశాఖ అధికారి పివి రత్నం, జిల్లా రిసోర్స్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి బి ప్రవీణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాంతి ప్రియ, ఉపాధ్యాయులు ప్రసాద్, నమస్తే డివిజనల్ సమన్వయకర్త మారుతి ప్రసాద్ రావు, మండల కోఆర్డినేటర్ వినయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.