కూటమి బలపరిచిన కోవూరు సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబు
నెల్లూరు, మేజర్ న్యూస్ : కోవూరు పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్పష్టం చేశారు. కోవూరు భవిష్యత్తు, ప్రజల అవసరాలు, పంచాయతీ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు పంచాయతీ నాయకులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబును కూటమి తరఫున బలపరుస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యావంతుడిగా, సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న వల్లెపు సునీల్ బాబుకు సర్పంచిగా పనిచేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. కోవూరు అభివృద్ధిని కాంక్షిస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. సునీల్ బాబు విజయాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సర్పంచి అభ్యర్థితో పాటు 20 వార్డుల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సూచించారు. పార్టీల మధ్య సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగుతూ కోవూరు పంచాయతీలో కూటమి విజయానికి బాటలు వేయాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే కోవూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో కోవూరును మున్సిపాలిటీగా అభివృద్ధి చేసి తీరుతామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. పంచాయతీగా కోవూరుకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అందించాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని... ఈ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.