andhrapradesh
భక్తిపారవశ్యంలో కోటి దీపోత్సవం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం
అవనిగడ్డ, మేజర్ న్యూస్ దివిసీమలో ప్రాచీన గాలిగోపురం గా ప్రసిద్ధి చెందిన అవనిగడ్డ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణం శనివారం సాయంత్రం కోటి దీపాల కాంతులతో ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. కార్తీక శుద్ధ ద్వాదశి పవిత్రతను చాటుతూ నిర్వహించిన కోటి దీపోత్సవం భక్తజనుల హరినామ స్మరణలు, దీపారాధనల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. వేలాది దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోగా, భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
శ్రీ శక్తి పీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి, శక్తిగురు మాతాజీ శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి మహాస్వామి కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తుల ప్రార్థనలతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
అంతకుముందు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పోతరాజు భాస్కర్ రావు దంపతుల నేతృత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం స్వామివారికి శాంతి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.