ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలంలో దాదాపు 8 గ్రామపంచాయతీల సర్పంచి పదవుల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మండలంలోని బట్టేపాడు పంచాయతీలో వాసిపల్లి ఆదిలక్ష్మమ్మ ఒక్కరే సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉన్నాయి. బట్టేపాడు జనరల్ మహిళకు రిజర్వు కాగా ఆదిలక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.మండలంలోని రామస్వామి పల్లి జనరల్ కాగా అక్కడ తండ్రి కొడుకులు మాత్రమే నామినేషన్లు వేసి ఉండడంతో కొడుకు ఉపసంహరించుకోనున్నారని మెంతెం వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నిక కానున్నారని తెలుస్తోంది. మండలంలోని చెర్లోఎడవల్లి జనరల్ మహిళకు రిజర్వుకాగా అక్కడ సుజాత అనే ఆమె ఒక్కరే సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. తీవ్రమైన పోటీ జరుగుతుందని భావించిన వాసిలి గ్రామపంచాయతీలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనుచరుడు మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి కూటమి బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేయగా అదే గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు అనుచరుడుగా ఉన్న మాజీ సర్పంచ్ గంగా శ్రీనివాసులు నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. వివిధ కారణాలతో గంగా శ్రీనివాసులు నాయుడు నామినేషన్ తిరస్కరించబడిందని దాంతో సుంకర పెంచల చౌదరి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికకానున్నారని చెబుతున్నారు. నాగులపాడు సర్పంచ్ పదవి జనరల్ కాగా అక్కడ ఇరు వర్గాల చర్చలతో నాయబ్ రసూల్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని చెబుతున్నారు. నారంపేట ఎస్సీ మహిళలకు రిజర్వు కాగా అక్కడ నామినేషన్ లు నలుగురు దాఖలు చేయగా ముగ్గురు నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయని, కూటమి బలపరిచిన చిట్టి పోయిన నాగ భవాని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యే పరిస్థితి ఏర్పడింది. మండలంలోని మహిమలూరు లో పలువురు నామినేషన్ వేసి ఉన్న ఏకగ్రీవ దిశగా చర్చలు జరుగుతున్నాయి. కనుపూరుపల్లిలో ఇరు వర్గాల ఏకాభిప్రాయంతో ఒక సాఫ్ట్వేర్ యువ ఇంజనీర్ నరసింహులు నామినేషన్ దాఖలు చేయగా మరో అభ్యర్థి పోటీగా నామినేషన్ వేసి ఉన్నారని ఏకగ్రీవ దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పమిడిపాడు పంచాయతీ జనరల్ కాగా పలువు నామినేషన్లు వేయగా ఏకగ్రీవ దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రావులకొల్లు పంచాయతీ ఎస్సీ జనరల్ కాగా అక్కడ సర్పంచ్ పదవికి ఏకగ్రీవ దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆరవీడు పంచాయతీ జనరల్ మహిళ కాగా ఆరవేడు, ఆరవేడు జంగాలపల్లి గ్రామాల మధ్య ఇరువురు అభ్యర్థుల పోటీ అనివార్యమైంది. వెన్నవాడలో తెలుగుదేశం బలపరిచిన ఒకరు జనసేనకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేసి ఉండడంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. కరటంపాడు లో పోటీగా నామినేషన్లు వేసినా ఏకగ్రీవ దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.అప్పారావు పాలలో నలుగురు నామినేషన్ వేసి ఉన్నందున పోటీ అనివార్యమయ్యేలా ఉంది.నల్లపురెడ్డి పల్లి లో కూడా పోటీ జరుగుతుందని చెబుతున్నారు. ఇరువురి మధ్య పోటీ ఉందని చెబుతున్నారు. బోయల సిరివెళ్ల పంచాయతీలో తీవ్ర పోటీ నెలకొందని చెబుతున్నారు. దేపూరు, బండారుపల్లి, నువ్వూరుపాడు,పడకండ్ల పంచాయతీల్లో పోటీ తీవ్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. నామినేషన్ల గడువు, పరిశీలన పూర్తికాగా ఈనెల 24వ తేదీ నామినేషన్ ల ఉపసంహరణ గడువు ఉంది.దాంతో ఇంకా పలు పంచాయతీల్లో ఏకగ్రీవం దిశగా చర్చలు సాగుతున్నాయి. 24వ తేదీ సాయంత్రానికి ఏ ఏ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి, ఏ ఏ పంచాయతీల్లో పోటీ జరగనుందో స్పష్టం కానుంది.