అంబేద్కర్ ను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: నేటి తరం విద్యార్థులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘుపతి సూచించారు. ఈ మేరకు ఈనెల 26 వ తేదీన నిర్వహించనున్న 77 వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పి చిట్టిబాబు ఆధ్వర్యంలో నగరం లోని పలు డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులకు " భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర " అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్థానిక ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీలకు దాదాపు 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘుపతి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగి భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర అనిర్వచనీయమన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని విద్యార్థులతో పాటు ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో కో - ఆర్గనైజర్లు కే అంబేద్కర్, కె విజయబాబు, డాక్టర్ జె సుధాకర్, ఎం విజయ్, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మదన్, ఎస్వి ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజుతో పాటు, నగరంలోని పిఎస్ఎన్ వివేకానంద, శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల, ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.