telangana
సమాజ చైతన్యంలో మీడియా పాత్ర కీలకం - జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.:
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : సమాజ చైతన్యానికి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి మీడియా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.నవంబర్ 16న నిర్వహించిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో జరిగే పరిణామాలను ప్రజలకు ప్రతిబింబించే నిలువుటద్దం మీడియా అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయుల కృషి అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ, వాటి పరిష్కారానికి దోహదపడే నిర్మాణాత్మక వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో తప్పుడు సమాచారం, అసత్య వార్తలు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున జర్నలిస్టులు వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిస్థాయిలో నిర్ధారించుకోవాలని అన్నారు. విశ్వసనీయత, నిష్పాక్షికత, బాధ్యతాయుతమైన జర్నలిజం మీడియా రంగానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.