బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి
రామాయంపేట : బీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయమైన వాటా, సామాజిక న్యాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న బీసీ జన గర్జన, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా శుక్రవారం రామాయంపేట మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించనున్న బీసీ జన గర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కుల కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సమాన అవకాశాలు సాధించుకోవాలంటే ఐక్యతే ప్రధాన బలమని పేర్కొన్నారు. కులాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా బీసీలందరూ ఒకే వేదికపైకి వచ్చి తమ హక్కుల కోసం గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగే జన గర్జన కార్యక్రమానికి తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోబీసీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం జిల్లా యువత అధ్యక్షుడు పోచమ్మ గణేష్ గుల్పర్తి రాము తో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు