భూముల రీసర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూర్య రాజన్న సిరిసిల్ల
జిల్లాలో భూముల రీసర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.భూముల రీ సర్వే ప్రక్రియ పురోగతి, ఎస్ ఐ ఆర్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని ఆయా మండలాల్లో ఇప్పటివరకు రీ సర్వే చేపట్టిన గ్రామాలు, పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. గ్రామ హద్దులు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, నీటి వనరుల రీ సర్వేపై అడిగి.. తహసీల్దార్లకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. గ్రామాల సరిహద్దు సర్వే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా చేపట్టాలని, భూములకు సంబంధించిన సమాచారం పక్కాగా సేకరించి, నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో సర్వే చేసే విషయమై రైతులకు జీపీఓ లు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. రైతుల సమక్షంలో వారి భూముల రీ సర్వే చేసి.. ఆ వివరాలను వారికి తెలియజేసి సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి, డీఐలు, తహసీల్దార్లు భూముల రీసర్వే చేపడుతున్న గ్రామాలలో పర్యటించి, ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. రీ సర్వే తో ఉపయోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు. భూములకు సంబంధించిన సమాచారం తప్పులు లేకుండా, పకడ్బందీగా సేకరించాలని ఆదేశించారు. రోజువారీగా పనులు చేపట్టి.. పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రత్యేక కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, డీఐలు, తదితరులు పాల్గొన్నారు.