యూనివర్సిటీ సిలబస్‌లో ఆర్ఎమ్, దిల్జిత్ దోసాంజ్, బియాన్స్.. సెలబ్రిటీలపై ప్రత్యేక కోర్సులు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా తమ సంగీతం, కళాత్మక ప్రయాణం, వ్యాపార విజయాలతో కోట్లాది మందిని ఆకట్టుకుంటున్న సెలబ్రిటీల జీవితాలు, వారి ప్రభావం ఇప్పుడు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అకడమిక్ పాఠ్యాంశాలుగా మారుతున్నాయి. బీటీఎస్ సభ్యుడు ఆర్ఎమ్, పంజాబీ గాయకుడు నటుడు దిల్జిత్ దోసాంజ్, పాప్ దిగ్గజం బియాన్స్ వంటి తారల సృజనాత్మకత, సాంస్కృతిక ప్రభావంపై పలు అంతర్జాతీయ యూనివర్సిటీలు ప్రత్యేక కోర్సులను రూపొందించి విద్యార్థులకు బోధిస్తున్నాయి.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో బీటీఎస్ ఆర్ఎమ్ స్ఫూర్తితో మానసిక ఆరోగ్యం, సృజనాత్మకత, నెమ్మదైన జీవనశైలి వంటి అంశాలపై ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టారు. ఆర్ఎమ్ సోలో ఆల్బమ్ ఇండిగో ఆధారంగా రూపొందించిన ఈ సెమినార్‌లో విద్యార్థులు ప్రెజెంటేషన్లు, ప్రాజెక్టుల ద్వారా మానసిక శ్రేయస్సు గురించి అధ్యయనం చేస్తారు. మరోవైపు బియాన్స్ సంగీతం, వ్యాపార సామ్రాజ్యంపై యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఎంబీఏ కోర్సును ప్రకటించగా, యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె సంగీత సాంస్కృతిక కోణాలను విశ్లేషిస్తూ ప్రత్యేక పాఠ్యాంశాన్ని అందించారు.
పంజాబీ సంగీతం, సినిమా రంగాలలో దిల్జిత్ దోసాంజ్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపు, సాంస్కృతిక మూలాలను నిలబెట్టుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తీరుపై కెనడాలోని టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సును ప్రారంభించారు. ప్రాంతీయ కళారూపాలు అంతర్జాతీయ ట్రెండ్స్‌గా ఎలా మారుతున్నాయో ఈ కోర్సు ద్వారా విద్యార్థులు తెలుసుకుంటారు.
వీరితో పాటు టేలర్ స్విఫ్ట్ గీత రచనలు, మడోనా పాప్ సంస్కృతి, నిక్కీ మినాజ్ హిప్ హాప్ ప్రభావం, హ్యారీ స్టైల్స్ ఫ్యాషన్, అమితాబ్ బచ్చన్ సినీ ప్రస్థానం వంటి అంశాలపై కూడా హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, డ్యూక్, నార్త్‌వెస్టర్న్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో కోర్సులు నడుస్తున్నాయి. పాపులర్ కల్చర్, మీడియా, బిజినెస్ వ్యూహాలను ఆధునిక తరానికి సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు విశ్వవిద్యాలయాలు ఈ వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నాయి.
Also Read: 57వ ఇఫీ ముగింపు చిత్రంగా ఆంథోనీ చెన్ ‘వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’