రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రాయిలాపూర్ విద్యార్థినుల ఎంపిక జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి అర్హత
రామాయంపేట : క్రీడల్లో గ్రామీణ విద్యార్థులు సైతం అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఈ క్రమంలో రామాయంపేట మండలం రాయిలాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.ఈ నెల 22న మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రాయిలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన అండర్-14 బాలికల విభాగం విద్యార్థినులు రచన, భవాని ఎంపికయ్యారు. ఇటీవల మెదక్‌లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా కబడ్డీ పోటీల్లో రాయిలాపూర్ పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం విశేషం.విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ విమల, పీఈటీ రజినీకాంత్‌తో పాటు ఉపాధ్యాయులు రాగి ఏగొండస్వామి, సందిరి బాపురెడ్డి, వీరగురువు, ముక్తేశ్వరి, వనజ, సౌజన్య, మహేష్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.