భారతీయ సినిమా భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఇఫీ 2026
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భౌగోళిక, భాషా, సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రజలను అనుసంధానించే శక్తి సినిమాకు ఉంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈ స్ఫూర్తిని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ముందుకు సాగుతోంది. సరిహద్దులు లేని కథలు అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం వర్ధమాన ప్రతిభ, ప్రాంతీయ కథకులు, స్వతంత్ర చిత్రనిర్మాతలకు వేదికగా నిలుస్తోంది. కేవలం సినిమా ప్రదర్శనలకే పరిమితం కాకుండా క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో, ఇండియన్ పనోరమా, వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాల ద్వారా సృజనాత్మక నైపుణ్యాల అభివృద్ధి నుంచి అంతర్జాతీయ ప్రేక్షకులు, భాగస్వాముల వరకు సినిమా నిర్మాణంలోని ప్రతి దశకూ ఇఫీ చేయూతనిస్తోంది.
యువ ప్రతిభావంతులకు శిక్షణ, సహకారం, సృజనాత్మకతను చాటుకునే అవకాశం కల్పించేందుకు 2021లో ప్రారంభించిన క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో కార్యక్రమం ఆరో విడతలో 13 సినిమా కళలలో 100 మంది యువ ప్రతినిధులను ఏకం చేస్తోంది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్, సౌండ్ రికార్డింగ్, కాస్ట్యూమ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి రంగాల యువత ప్రముఖ నిపుణులతో మాస్టర్‌క్లాసులు, వర్క్‌షాపులు, 48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్, టాలెంట్ క్యాంప్‌లో పాల్గొంటారు. 2022లో ఇందులో పాల్గొన్న చిదానంద ఎస్ నాయక్ రూపొందించిన కన్నడ లఘు చిత్రం 2024 కేన్స్ చిత్రోత్సవంలో లా సినీఫ్ అవార్డు అందుకోవడం ఈ వేదిక ప్రాధాన్యతకు నిదర్శనం. ఇక ఇఫీ 2026లో స్వదేశీ, విదేశీ 52 మంది మహిళా దర్శకులు, 62 మంది తొలి చిత్ర దర్శకుల చిత్రాలు ప్రదర్శితం కానుండగా, ఉత్తమ తొలి ఫీచర్ ఫిల్మ్ పోటీలో భారత్ నుంచి ది స్లెడ్జ్, బర్డ్స్ ఆన్ ఐస్ చిత్రాలతో పాటు మొత్తం ఏడు చిత్రాలు పోటీ పడుతున్నాయి.
భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటే ఇండియన్ పనోరమా విభాగం 57వ ఇఫీలో 404 ఫీచర్, 358 నాన్ ఫీచర్ ఎంట్రీల నుంచి ఎంపిక చేసిన 25 ఫీచర్ చిత్రాలు, 20 నాన్ ఫీచర్ చిత్రాలను ప్రదర్శించనుంది. విస్తృత భారతీయ సినిమా విభాగంలో 18 భాషలకు చెందిన 76 చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. నాన్ ఫీచర్ విభాగంలో లీనా యాదవ్ దర్శకత్వం వహించిన లడఖీ చిత్రం బికమింగ్ ప్రారంభ చిత్రంగా నిలువగా, ఫీచర్ విభాగంలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ప్రారంభ చిత్రంగా ప్రదర్శితం కానుంది. వీటితో పాటు ఉరుమ్, పిలి చెన్నె, బర్డ్స్ ఆన్ ఐస్ వంటి చిత్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, మరాఠీ మరియు మలయాళ సినిమాల వైభవాన్ని కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు.
దక్షిణాసియాలోనే అతిపెద్ద సినీ మార్కెట్‌గా గుర్తింపు పొందిన వేవ్స్ ఫిల్మ్ బజార్ 2026లో 20వ ఎడిషన్‌లోకి అడుగుపెడుతూ స్వతంత్ర చిత్రనిర్మాతలు, నిర్మాతలు, ఆర్థిక భాగస్వాములు, పంపిణీదారులను అంతర్జాతీయ వేదికపై అనుసంధానిస్తోంది. కో ప్రొడక్షన్ మార్కెట్, స్క్రీన్‌రైటర్స్ ల్యాబ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్, ప్రొడ్యూసర్స్ ల్యాబ్, వ్యూయింగ్ రూమ్ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రాజెక్టులకు ఆర్థిక, సాంకేతిక, పంపిణీ మద్దతు లభిస్తోంది. మరోవైపు బ్రిక్స్ సినిమా షోకేస్ కింద 21 చిత్రాలను ప్రదర్శిస్తూ స్వేచ్ఛ, గుర్తింపు, సామాజిక న్యాయం, పర్యావరణం వంటి అంశాలపై దేశాల మధ్య సాంస్కృతిక సంవాదానికి వారధిగా నిలుస్తోంది. సృజనాత్మకత, వాణిజ్యం, సంస్కృతుల సంగమంగా నిలుస్తున్న ఈ కార్యక్రమాలు భారతీయ సినిమాకు కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.