రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రాపో23 ప్రీ-లుక్ పోస్టర్ విడుదలై సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ పోస్టర్ సినిమా కథాంశం, రామ్ పాత్రపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్‌లో రామ్ అత్యంత మిస్టీరియస్‌గా కనిపిస్తున్నారు. భారీ నిర్మాణంతో కూడిన ఓ భవనం మెట్లపై కెమెరాకు వీపు చూపిస్తూ నిలబడి ఉన్న ఆయన, నల్లటి దుస్తులు, తల వెనుక భాగంలో ప్రత్యేకమైన టాటూతో కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఒక చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని కనిపించడం పాత్రలోని వైరుధ్యాన్ని, లోతైన కోణాన్ని సూచిస్తోంది. గ్రే రంగు బ్యాక్‌డ్రాప్, జామెట్రిక్ నిర్మాణాలు పోస్టర్‌కు తీవ్రతను తీసుకువచ్చాయి.
తనదైన దారిని తానే ఎంచుకుంటూ, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా లోన్ వుల్ఫ్ పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, సొంత ఆలోచనలతో సాగే ఈ పాత్ర చుట్టూ కథనం ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది. నటుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగానూ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతుండటం విశేషం.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ యాక్షన్ సన్నివేశాలను సమకూరుస్తున్నారు. త్వరలోనే టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.