మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యువతను విశేషంగా ఆకట్టుకున్న హీరో రామ్ నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సోల్జర్స్ ఫ్యాక్టరీ, రెడాక్టెడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో రామ్ నితిన్ సరసన ప్రథానా నాథన్, తేజు అశ్విని కథానాయికలుగా నటిస్తున్నారు. పార్కింగ్, టీటీటీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రథానా నాథన్ ప్రస్తుతం నింజా చిత్రంలో నటిస్తుండగా, ఎన్న సొల్ల పోగిరై ఫేమ్ తేజు అశ్విని సూపర్ హీరో బాబులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తిక్ జై పళని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న పార్కింగ్ చిత్రాన్ని నిర్మించిన సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థ, వివాహ భోజనంబు, డిక్కిలోనా వంటి ప్రాజెక్టులతో మంచి గుర్తింపు పొందింది. మరోవైపు తమిళ, మలయాళ రంగాలలో చురుగ్గా ఉన్న రెడాక్టెడ్ స్టూడియోస్ సంస్థ, ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.
కొత్త ప్రతిభను, విభిన్నమైన కథాంశాలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని, మంచి నటీనటులు, సాంకేతిక బృందంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తామని నిర్మాణ సంస్థలు తెలిపాయి. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
Also Read: రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న!