రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బట్టల రామస్వామి బయోపిక్ చిత్రంతో గుర్తింపు పొందిన అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. షర్మాస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో అను శ్రీ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డాక్టర్ గోరటి వెంకన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ గోరటి వెంకన్న, చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదాలు కొందరు కల్పించినవేనని, కళకు అలాంటి పరిమితులు ఉండవని స్పష్టం చేశారు. నంది పురస్కారాలు అందుకున్న నాటకం ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారని, తాను ఈ సినిమాను మూడుసార్లు చూసినా ఎక్కడా బోర్ కొట్టలేదని తెలిపారు. రాజకీయ నేపథ్యంతో కాకుండా, ఒక జీవితాన్ని హృద్యంగా చూపించే కథాంశంతో మూస సినిమాలకు భిన్నంగా అల్తాఫ్ చరిత్ర సృష్టించబోతున్నారని ప్రశంసించారు.
హీరో, దర్శకుడు అల్తాఫ్ హసన్ మాట్లాడుతూ, డి.విజయభాస్కర్ రాసిన నాటకం ఆధారంగా మూడు నెలల పాటు చర్చలు జరిపి సినిమా స్క్రిప్ట్‌ను రూపొందించామని చెప్పారు. గోరటి వెంకన్న తన తండ్రి పాత్ర పోషించడంతో పాటు ఒక అద్భుతమైన పాట కూడా రాశారని, జగదీశ్ సత్యన్ అందించిన ఏడు పాటలు చిత్రానికి ప్రాణంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పీఎస్ మణికర్ణన్ సినిమాటోగ్రఫీ, నిర్మాత చిన్ని సహకారంతో ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు.
రచయిత డి.విజయభాస్కర్ మాట్లాడుతూ, గ్రామాల్లోని ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా బడుగు వర్గాలు చైతన్యవంతమై తిరగబడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపిస్తున్నామని తెలిపారు. సంగీత దర్శకుడు జగదీశ్ సత్యన్, గీత రచయిత లక్ష్మణ్, ఎడిటర్ సతీష్ రాజాతో పాటు కేశవ, అశోక్ రెడ్డి, శివకుమార్ కాముని, విజయలక్ష్మి, సంజయ్ గౌడ్ తదితరులు తమ అనుభవాలను పంచుకుంటూ, మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.