వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు
తాడిమర్రి సూర్య రిపోర్టర్ :- ఒక చేతిలో పుస్తకం.. మరో చేతిలో పోరాట స్ఫూర్తి.. అణచివేతను ఎదిరించి చరిత్ర సృష్టించిన వీరనారుల అడుగుజాడల్లో నేటి మహిళలు నడవాలని పిలుపునిస్తూ తాడిమర్రి శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారోత్సవాల్లో భాగంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని మహిళల అభ్యున్నతి, సాధికారతపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. తొలుత ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చూపిన వీరత్వం, సరోజినీ నాయుడు అందించిన జాతీయ సేవలు, మదర్ థెరిస్సా చేసిన మానవతా సేవలు, సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. మహిళలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా విద్య, విజ్ఞానం, విజయం వైపు అడుగులు వేస్తూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళలకు అవకాశాలు కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఒక కుటుంబం వెలుగొందుతుందని, మహిళలు అభివృద్ధి సాధిస్తే దేశమే అభివృద్ధి చెందుతుందని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు. మహనీయుల జీవిత చరిత్రలను చదవడం ద్వారా నేటి విద్యార్థినులు ధైర్యం, పట్టుదల, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి డి. శీనానాయక్, గ్రంథాలయ పాఠకులు, పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల నిలయం మాత్రమే కాదు.. వ్యక్తిత్వ వికాసానికి, మహిళా చైతన్యానికి, సమాజ పరివర్తనకు వేదిక అని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.