నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!
- ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
- అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి
- స్వర్ణ గ్రామంలో నామినేషన్ల స్వీకరణను తనిఖీ చేసిన కలెక్టర్ డా. ఏ. సిరి
**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
గురువారం ఓర్వకల్లు మండలంలోని స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నామినేషన్ పత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలని, ప్రతి అంశాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో కర్నూలు డివిజన్ ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.