రెండో రోజు ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు!
రెండో రోజు ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు!
* సర్పంచ్ స్థానాలకు 54, వార్డు సభ్యుల స్థానాలకు 218 నామినేషన్లు
* రెండు రోజుల్లో సర్పంచ్‌లకు 67, వార్డు సభ్యులకు 254 నామినేషన్లు
* నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.. పటిష్ట పోలీసు బందోబస్తు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది. శుక్రవారం మండల వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు 54, వార్డు సభ్యుల స్థానాలకు 218 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 13, వార్డు సభ్యుల స్థానాలకు 36 నామినేషన్లు నమోదయ్యాయి. దీంతో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 67, వార్డు సభ్యుల స్థానాలకు 254 నామినేషన్లు దాఖలయ్యాయి.
మండలంలోని ఎనిమిది గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్సై సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు.