కందనెల్లి చెక్‌డ్యామ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్
పెద్దేముల్, మేజర్ న్యూస్: గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పెద్దేముల్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పణంగా పెట్టిన రూ.12,150 నగదుతో పాటు 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 18న సాయంత్రం కందనెల్లి గ్రామ శివారులోని కాగ్నా వాగు సమీపంలోని చెక్‌డ్యామ్ వద్ద డబ్బులు పణంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పెద్దేముల్ ఎస్‌ఐ ఎం. ప్రశాంత్ వర్ధన్ తన సిబ్బందితో కలిసి అక్కడ ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో తాండూరు మండలంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆసిఫ్ షేక్, పాషా అయూబ్, కోకట్ తండాకు చెందిన లాలావత్ రవి, రాజీవ్ కాలనీకి చెందిన రజాక్, సుభాష్ నగర్ కాలనీకి చెందిన బండి శ్రీధర్, తాండూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆర్యన్ డేవిడ్, ఇందిరానగర్ కాలనీకి చెందిన మహ్మద్ ఆరిఫ్, పెద్దేముల్ మండలం తట్టేపల్లికి చెందిన సలీమ్ ఉన్నారు. నిందితుల నుంచి రూ.12,150 నగదు, 52 పేకాట ముక్కలను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు, పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 227/2026, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్టవిరుద్ధమైన జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు.