కూతురి పేరు ప్రకటించిన ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్.. సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోలు వైరల్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రేమలు, బెత్లెహెం కుడుంబ యూనిట్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా విశేషంగా చేరువైన మలయాళ నటుడు సంగీత్ ప్రతాప్ తన అభిమానులతో ఒక మధురమైన విషయాన్ని పంచుకున్నారు. రెండు వారాల క్రితం తండ్రయిన ఆయన, తన గారాల పట్టికి నామకరణం చేసి చిన్నారి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తమ కూతురికి తారా రైనే అనే అందమైన పేరు పెట్టినట్లు వెల్లడించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
స్వతహాగా ఎడిటర్‌గా 2019లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సంగీత్ ప్రతాప్, 2022లో విడుదలైన హృదయం సినిమాలో చిన్న పాత్ర ద్వారా నటుడిగా మారారు. ఆ తర్వాత తెలుగులోనూ డబ్ అయి ఘనవిజయం సాధించిన ప్రేమలు చిత్రంలోని అమూల్ డేవిస్ పాత్ర ఆయన కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. తన సహజమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంగీత్, నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
వ్యక్తిగత జీవితంలో 2023 నవంబర్‌లో ఆన్సీని వివాహం చేసుకున్న సంగీత్ ప్రతాప్, ఈ ఏడాది జూలైలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ దంపతులు, ఇప్పుడు చిన్నారి తారా రైనే ఆలనాపాలనలో సంతోషంగా గడుపుతున్నారు. పాప ఫొటోలు నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే బెత్లెహెం కుడుంబ యూనిట్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగీత్ ప్రతాప్, తదుపరి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రేమలు కథానాయిక మమిత బైజుతో కలిసి ఆయన జంటగా నటించిన హలో డియర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read: హై సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదల!