పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన
వికారాబాద్, మేజర్ న్యూస్: విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు చేపట్టిన పారిశ్రామిక సందర్శనలో భాగంగా పీఎం శ్రీ వోకేషనల్ ఎడ్యుకేషన్ సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలకు చెందిన 9, 11వ తరగతి విద్యార్థులు చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని అంతారం గ్రామంలో ఉన్న శ్రీ చక్ర మిల్క్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ మల్లికార్జున శర్మ ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల సేకరణ, నాణ్యత పరీక్షలు, పాశ్చరైజేషన్, శీతలీకరణ, కోల్డ్ స్టోరేజీ, వివిధ పాల ఉత్పత్తుల తయారీ ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫ్యాక్టరీ మేనేజర్ రామకృష్ణ పరిశ్రమలో వినియోగించే యంత్రాల పనితీరు, పాల ఉత్పత్తుల తయారీలో పాటించే పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్శనతో పాల పరిశ్రమ నిర్వహణ, ఆహార శుద్ధి ప్రక్రియలపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కలిగింది. కార్యక్రమంలో 9వ తరగతికి చెందిన 34 మంది, 11వ తరగతికి చెందిన 34 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ప్రియాంక, రేణుక, హసీనా, అనిత పాల్గొన్నారు.