అనుమతులు లేకుండా బోర్లు వేస్తే క్రిమినల్ కేసులు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత లోతైన భూగర్భ జలమట్టాలు జిల్లాలో నమోదవుతున్నాయని, ప్రస్తుతం భూమి ఉపరితలం నుంచి 13.54 మీటర్ల లోతులో నీటి మట్టం ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితి తాగునీటి అవసరాలు, వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున భూగర్భ జలాల పరిరక్షణకు తెలంగాణ నీరు, భూమి, చెట్ల చట్టం–2002 (వాల్టా) ప్రకారం కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ, గృహ అవసరాల కోసం కొత్త బోరుబావులు తవ్వాలనుకునే వారు తప్పనిసరిగా మీసేవ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, ఆఫ్‌లైన్‌లో లేదా నేరుగా కార్యాలయాల్లో సమర్పించే దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపారు. మీసేవ ద్వారా జారీ చేసిన సిస్టమ్ జనరేటెడ్ అనుమతి పత్రం లేకుండా బోర్లు తవ్వితే వాటిని సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించి, వాల్టా చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భూగర్భ జల శాఖ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మీసేవ అనుమతి పత్రం లేకుండా జిల్లాలో తిరిగే బోరు రిగ్గులను సీజ్ చేసి, రిగ్గు యజమానులు, భూ యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శాస్త్రీయ పరిశీలన, సాంకేతిక అనుమతులు లేకుండా బోర్లు వేయడం వల్ల నీరు పడక రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని అమలు చేయాలని, తమ ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై జరిమానాలు, మూసివేత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే యాసంగి సీజన్‌లో భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉన్నందున అధిక నీటిని వినియోగించే వరి పంటకు బదులుగా జొన్న, రాగి, శనగలు, కందులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. కూరగాయల సాగులో బిందు, తుంపర సేద్య పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగిస్తూ నీటి వృథాను అరికట్టాలని, గృహ అవసరాల్లో ట్యాంకులు పొంగిపొర్లకుండా చూడటం, నీటి లీకేజీలను నివారించడం, వాహనాలు, వాకిళ్లు కడగడానికి తాగునీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భూగర్భ జలాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, జిల్లా ప్రజలు, రైతులు, నీటి వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక తహశీల్దార్ లేదా జిల్లా భూగర్భ జల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.