తైక్వాండోలో పసిడి పతకాల పంట.. జాతీయ స్థాయికి పాత మంచిర్యాల క్రీడాకారులు!
• విజేతలను, కోచ్‌ను అభినందించి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
గద్వాల్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీల్లో పాత మంచిర్యాలకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పసిడి పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. చెట్టి కౌశిక్, నాగుల శశివర్ధన్ రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను చాటుకుని బంగారు పతకాలు కైవసం చేసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు చెట్టి కౌశిక్, నాగుల శశివర్ధన్‌తో పాటు వారికి శిక్షణ అందించిన కోచ్ మైదం సుజిత్‌ను మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ అభినందించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లోనూ అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, సరైన ప్రోత్సాహం, శిక్షణ లభిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలరని అన్నారు. తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాబోయే జాతీయస్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో పాల్గొని పతకాలు సాధించి మంచిర్యాల జిల్లాకు, పాత మంచిర్యాల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.
క్రీడాకారుల విజయానికి కృషి చేసిన కోచ్ మైదం సుజిత్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాత మంచిర్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.