స్మార్ట్‌ఫోన్‌లను మించిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
సూర్య బిజినెస్ డెస్క్: భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లే ప్రధాన ఆధారంగా ఉన్న ఎగుమతుల తీరు మారి, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వేగంగా దూసుకుపోతున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి ఆరు నెలల్లో భారత్ ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 44 శాతం పెరిగి 31.97 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2025–26 ఇదే కాలంలో ఈ విలువ 22.20 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది కాలంలో 9.77 బిలియన్ డాలర్ల వృద్ధి నమోదవగా, స్మార్ట్‌ఫోన్లు మినహా ఇతర విభాగాల ఎగుమతులు 56.5 శాతం పుంజుకుని 8.81 బిలియన్ డాలర్ల నుంచి 13.79 బిలియన్ డాలర్లకు ఎగబాకడం విశేషం. దీంతో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో నాన్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల వాటా 39.7 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగింది.
ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, నెట్‌వర్క్ ట్రాన్స్‌మిషన్ మరియు రూటింగ్ పరికరాలు, మెమరీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ పరికరాలు వంటి విభాగాలలో అసాధారణ వృద్ధి నమోదైంది. మౌంటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు విడిభాగాలు మరియు ఉపకరణాల ఎగుమతులు ఏకంగా 3,219 శాతం పెరిగి 63.3 మిలియన్ డాలర్ల నుంచి 2.10 బిలియన్ డాలర్లకు చేరాయి. వీటిలో సింగపూర్ 1.87 బిలియన్ డాలర్లతో అగ్రగామిగా నిలవగా, చైనా 111.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. పాపులేటెడ్ లేదా లోడెడ్ పీసీబీ ఎగుమతులు 304 శాతం పెరిగి 213.7 మిలియన్ డాలర్ల నుంచి 864.1 మిలియన్ డాలర్లకు చేరాయి. వీటికి చైనా 789.2 మిలియన్ డాలర్లతో ప్రధాన మార్కెట్‌గా నిలిచింది.
నెట్‌వర్క్ ట్రాన్స్‌మిషన్ మరియు రూటింగ్ పరికరాల ఎగుమతులు 98 శాతం పెరిగి 732.9 మిలియన్ డాలర్ల నుంచి 1.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. హాంకాంగ్ 857.7 మిలియన్ డాలర్లతో అతిపెద్ద గమ్యస్థానంగా నిలువగా, అమెరికా, నెదర్లాండ్స్ కీలక మార్కెట్లుగా ఉన్నాయి. మెమరీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల ఎగుమతులు 23.1 మిలియన్ డాలర్ల నుంచి 562.4 మిలియన్ డాలర్లకు దూసుకెళ్లి 2,333 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మలేషియా 390.8 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలవగా, సింగపూర్, హాంకాంగ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అలాగే సాలిడ్ స్టేట్ స్టోరేజ్ పరికరాల ఎగుమతులు 14.6 మిలియన్ డాలర్ల నుంచి 260.5 మిలియన్ డాలర్లకు పెరిగి 1,680 శాతం వృద్ధి సాధించాయి. వీటికి చైనా, సింగపూర్, హాంకాంగ్, అమెరికా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు కూడా 2026–27 మొదటి అర్ధభాగంలో 35.8 శాతం వృద్ధితో 13.38 బిలియన్ డాలర్ల నుంచి 18.17 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ, మొత్తం ఎగుమతులలో వాటి వాటా 60.3 శాతం నుంచి 56.8 శాతానికి తగ్గింది. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు తగ్గడం వల్ల కాకుండా, ఇతర విభాగాలు అంతకంటే వేగంగా విస్తరించడం వల్లే ఈ మార్పు వచ్చింది. సింగపూర్, చైనా, హాంకాంగ్, మలేషియా వంటి దేశాలతో పాటు అమెరికా, నెదర్లాండ్స్ మార్కెట్లలో భారత ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ప్రత్యేక ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వల్ల దేశ ఎగుమతి బుట్ట మరింత వైవిధ్యభరితంగా, బలంగా మారుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.