భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు
సూర్య బిజినెస్ డెస్క్: భారత్ మరియు ఇటలీ మధ్య 2029 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోల స్థాయికి చేర్చాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో కలిసి రోమ్‌లో జరిగిన 23వ భారత్ ఇటలీ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులను విస్తరించడం, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్లడంపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. 2025 నుంచి 2029 వరకు అమలులో ఉన్న ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికతో పాటు 2026 మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన ఫలితాల ఆధారంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని వారు నిర్ణయించారు.
ఆటోమోటివ్ మరియు ఏరోస్పేస్ పరిశ్రమలు, ఇండస్ట్రీ 4.0, వ్యవసాయం మరియు అగ్రి టెక్నాలజీ, కనెక్టివిటీ, ఇంధనం, కీలక ఖనిజాలు, సైన్స్ అండ్ ఇన్నోవేషన్, సంస్కృతి, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత వంటి రంగాలలో సహకారంపై చర్చలు జరిగాయి. భారత్‌లో విస్తరిస్తున్న తయారీ సామర్థ్యాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తోడు, అధునాతన తయారీ, ఇంజనీరింగ్, యంత్రపరికరాలు, సాంకేతికతలో ఇటలీకున్న బలాలు పరస్పరం పూరకంగా నిలుస్తాయని ఇరు పక్షాలు గుర్తించాయి. జాయింట్ వెంచర్లు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో సమగ్రత ద్వారా పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని తీర్మానించారు. ఇటీవల విజయవంతంగా ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల మార్కెట్ ప్రవేశం మెరుగుపడటంతో పాటు వాణిజ్య, పెట్టుబడి ప్రవాహాలు పెరుగుతాయని, సరఫరా గొలుసులు మరింత బలపడతాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రోమ్ పర్యటన సందర్భంగా నవంబర్ 17న పీయూష్ గోయల్ పలు ప్రముఖ ఇటలీ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు మరియు సీనియర్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. వాల్టర్ టోస్టో, నార్డింపియాంటి సిస్టమ్, అటిటెక్, మగల్డి గ్రూప్, బ్రాకో గ్రూప్ ప్రతినిధులతో భారత్‌లో పెట్టుబడులు, తయారీ, సాంకేతిక భాగస్వామ్య అవకాశాలపై ఆయన చర్చించారు. అనంతరం ఇటలీలోని భారత రాయబారి వాణీ రావు, ఇటలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మౌరో బట్టోచ్చి ప్రారంభించిన భారత్ ఇటలీ బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ఫోరమ్‌లో గోయల్ ప్రసంగించారు. ఈ ఫోరమ్‌లో 12 స్టార్టప్‌లతో సహా సుమారు 80 మంది భారతీయ వ్యాపార ప్రతినిధులు, ఇటలీ కంపెనీలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫోరమ్‌లో భాగంగా ఫార్మాస్యూటికల్స్ మరియు కెమికల్స్, ఇండస్ట్రియల్ మెషినరీ మరియు అగ్రి ఫుడ్, ఆటోమోటివ్ రంగాలపై మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఔషధ తయారీ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియెంట్స్, స్పెషాలిటీ కెమికల్స్, బయోటెక్నాలజీ, ఉమ్మడి పరిశోధన, ఆటోమేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలు, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆటో కాంపోనెంట్స్ వంటి రంగాలలో సంయుక్త ప్రాజెక్టులు మరియు టెక్నాలజీ భాగస్వామ్యాల ద్వారా వాణిజ్య ఫలితాలను సాధించడంపై ప్రతినిధులు దృష్టి సారించారు. ఇరు దేశాల ప్రధానమంత్రుల దార్శనికతను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చడానికి నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యాపార భాగస్వామ్యాల ద్వారా ముందుకు సాగాలని పీయూష్ గోయల్ మరియు ఆంటోనియో తజానీ పునరుద్ఘాటించారు.