జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నిరంతరం పోరాటం సాగిస్తుందని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షుడు ఫైరోజ్ భాష స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా వారి పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు.జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిత్తూరు నగరంలో అసోసియేషన్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి వారితో కలిసి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఆశ్రమంలోని వారికి పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు ముత్యాల శెట్టితో జర్నలిస్టు నాయకులు మాట్లాడి ఆశ్రమంలో ఉన్నవారి అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున తమ వంతు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్. లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షుడు ఫైరోజ్ భాష, ఆర్ కే విద్యాలయ అండ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం జాప్ ఆవిర్భావం నుంచి నిరంతరం కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే అనేక పోరాటాలు నిర్వహించామని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో పాటు అవసరమైన సందర్భాల్లో ఉద్యమాలకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న పాత్రికేయుల రక్షణకు తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ ఇటువంటి ఘటనలను తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. జాప్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ సూచనలు, మార్గదర్శకత్వంలో సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి జర్నలిస్టుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని నాయకులు వెల్లడించారు.ఆవిర్భావ దినోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు జ్ఞాన ప్రకాష్, కార్యదర్శి లవకుమార్, కార్యవర్గ సభ్యులు నవాజ్, సభ్యులు సంపత్, చిట్టిబాబు, దినేష్ కుమార్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్