శతక సాహిత్యం-సామాజిక స్పృహ
శతక సాహిత్యం-సామాజిక స్పృహ
రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ ::-- 82477433432
తెలుగు సాహిత్యంలో శతక వాఙ్మయానికి ప్రత్యేక స్థానమున్నది. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ మన కవులు అనేక శతకాలను రాశారు, రాస్తూనే ఉన్నారు. అలతి అలతి పదాలతో చక్కని భావాన్ని అందిస్తాయి శతక పద్యాలు, మానవులు అనుసరించాల్సిన విధి విధానాలు, నీతి విషయాలు, మంచి చెడులు, నడవడిక, ప్రవర్తన మొదలైన అన్ని విషయాలను చాలా చక్కగా వివరిస్తాయి
శతకపద్యాలు. ఒక్కో పద్యం వెనుక ఎన్నో కథలు, చారిత్రక గాథలు, ఉదాహరణలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శతకాలు మనిషి నైతిక ప్రవర్తనకు మార్గదర్శకాలు, తెలుగు సాహిత్యంలో పద్యానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. పద్యానికి పెట్టింది “పేరు శతక సాహిత్యం. 'శత' అంటే వంద. వంద పద్యాలుగల కావ్యాన్ని 'శతకం' అంటారు. ఇందులో ఏ పద్యానికాపద్యం విడి విడిగా ఉంటూ దేనికదే భావాన్ని వివరిస్తుండటం మూలంగా దీనిని 'ముక్తకము' అని కూడా అంటారు.
సంస్కృత భాష నుండి తెలుగులోనికి శతకం వచ్చిందని చెబుతుంటారు పెద్దలు.
13వ శతాబ్దినికి చెందిన అమృతానంద యోగి తన 'అలంకార సంగ్రహం'లో 'శతకం శతకం ప్రోక్తమష్టోత్త ర శతంపరమ్' అని చెప్పాడు. ఆధునికులు కొందరు శతకాన్ని 'దేశ కవితా విభాగంలో చేర్చారు. శతక పద్యాలు నీతి, ధర్మ, సందేశాలను వివరిస్తూ, చిన్ని చిన్ని కథలను ఇతివృత్తాలుగా బోధిస్తుంటాయి. శతకాలు సులభ గ్రాహ్యకాలుగా చదివే వారికి ఇట్టే అర్ధమయ్యేలా ఉంటాయి. ఎంతో పేరు పొందిన ప్రబంధ కవి అయినా ఏదో ఒక శతకం రాసినట్లుగా చరిత్ర వలన తెలుస్తుంది.
ఇక ప్రకృత విషయానికొద్దాం...
శతక సాహిత్యం లో సామాజిక స్ప్రహ
అనే విషయాన్ని పరిశీలించుదాం.
సమాజంలో జరుగుతున్న పలు సంఘటనలు, సన్నివేశాల ద్వారా మనిషి లేదా ప్రాణులు వివిధ రకాలుగా, బహుముఖాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, శతక సాహిత్యంలో సామాజికస్పృహ వాటికి పరిష్కార మార్గాలు చూపటమే సామాజిక స్పృహ, మనిషి ప్రశాంతంగా, చక్కగా, ఆరోగ్యకర వాతావరణంలో పెరగటానికి కావలసిన పరిస్థితులు లేకపోతే ఆ మనిషి ఎదుర్కొంటున్న పలు రకాలైన ఇబ్బందులను గుర్తిస్తూ వాటికి పరిష్కారా లు చూపటమే సామాజిక స్పృహ సమాజం లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు.
ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగతంగా, కొన్ని కుటుంబ పరంగా, కొన్ని సమాజ పరంగా ఉన్న అన్నిటినీ ఎదుర్కోవాలి అంటే ఎవరో ఒకరు ఆయా సమస్యలను ముందుగా గుర్తించినవారు చెప్పాలి. వాటికి పరిష్కారమార్గాలు చెప్పాలి. దానినే సామాజిక స్పృహ అంటారు. అట్లాంటి సామాజిక స్పృహ మన తెలుగు శతక వాఙ్మయంలో చాలా ఎక్కువగానే ఉన్నది.
క్రాంతదర్శి, మార్గదర్శకుడు, పథ నిర్దేశకుడు, చైతన్యగామి అయిన కవి స్వీయానుభూతితో కానీ, పరిశీలనతో కానీ, అధ్యయనంలో కానీ తాను గుర్తించిన పలు సమస్యలకు పరిష్కారాలను సాహిత్యం ద్వారా సమాజానికి అందిస్తుంటాడు. దీనినే కవికి సామాజిక స్పృహ ఉన్నది అంటారు. మన తెలుగు సాహిత్యంలో సాహిత్యాన్ని సృజియించిన కవి పండితులందరు, రచయితలందరూ సమాజాన్ని బాగా పరిశీలించి ఎన్నో విషయాలను సామాజిక స్పృహను తన బాధ్యతగా గుర్తించినారు.
శతక సాహి త్యాన్ని సృజియించిన కవి పండితులు
తమ శతకాలలో సామాజిక స్పృహను
అందించినారు. సమాజ హితాన్ని కోరేది
సాహిత్యమైతే అందులో సామాజిక స్పృహతో శతక సాహిత్యం విలసిల్లినదని తప్పకచెప్పవచ్చు.
సమాజంలో ఇంతకు ముందు, ఇప్పుడు కూడా హింస, దౌర్జన్యం, కిడ్నాప్ లు, హత్యలు, మానభంగాలు, బాధ్యతా రహితంగా ప్రవర్తించడం, నిర్లక్ష్యంగా
వ్యవహరించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల శాంతికి విఘాతం కలిగి, భద్రత కరువై
జన జీవనంలో ఎన్నో భయ భ్రాంతులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఇట్లా ఉంటే రేపటికి ఇంకా ఎల్లా ఉంటాయో అనే బతుకు మీద బెంగతో క్షణం క్షణం భయంతో గడుపుతున్న సమాజానికి ప్రేమ, దయ, కరుణ, స్నేహం, సహకారం, జాలి, ఉపకారం, అనురాగం, ఆప్యాయత మొదలైన మానవ లక్షణాలతో కూడిన జీవిత విలువలు, నైతిక విలువలు, సంబంధ బాంధవ్యాల గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆ పని సాహిత్యం తప్పనిసరిగా చేస్తున్నది. అందులోనూ సామా జిక స్పృహమెండుగా కల శతక సాహిత్యం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది.
పైన చెప్పిన విషయాలతో కూడిన సామాజిక స్పృహ శతకాలలో మెండుగానే కనపడుతోంది.
శతకాలు నీతి కథా విషయాలకు పుట్టినిళ్ళు
శతకాలు పురాణాలలాగా కథలు చెప్పవు. సూచనలు చేస్తాయి. ప్రబంధాలు గా వర్ణించవు, గుర్తుకు తెస్తాయి. చరిత్ర కాలంలో, రాజుల కాలంలో, పురాణాల కాలంలో, ప్రాచీన కాలంలో జరిగిన అనేక సంఘటనలను ఉదహరిస్తూ మనం ఎట్లా ప్రవర్తించకూడదో, ఎట్లా ప్రవర్తించాలో మొదలైన విషయాలను అలతి అలతి పదాలతో అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించి చెబుతాయి శతకాలు. చరిత్రను పరిశీలిస్తే మనకు లభ్యమవుతున్న ఎన్నో శతకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో లక్షలాదిగా శతకాలు ఉన్నాయి. కొన్ని లభ్యాలు, కొన్ని అలభ్యాలుగాను, ముద్రితాలుగా, అముద్రితాలు గాను లభిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే భక్తి, శృంగార, నీతి, వేదాంత, హాస్య, తాత్విక, చారిత్రక, జీవిత చారిత్రక, స్వీయచరిత్ర, కథా, సమస్యా, నిఘంటు, అనువాద, అచ్చ తెలుగు శతకాలు, చాటు శతకాలుగా లభిస్తున్న ఈ అన్ని శతకాలలో సామాజిక స్పృహ మెండుగానే కనపడుతుంది.
'వేమన, సుమతీ, దాశరధి, శ్రీ కాళహస్తీశ్వర, భాస్కర, కుమార, కుమారీ, శ్రీకృష్ణ, రామక, ఆంధ్ర నాయక, శ్రీనరసింహ, తెలుగు బాల, నార్ల, కవి చౌడప్ప, శ్రీమూర్తి రాజ, ఋణ, సుధీశ, నారాయణ.. మొదలైన ఎన్నో ప్రాచీన, ఆధునిక శతకాలను పరిశీలిస్తే ఆయా శతకాలలోని ఒక్కో పద్యం వెనుక ఎంతో నీతి ఉంటుంది. ఆయా శతకాలు అన్నీ సామాజిక స్పృహ కలిగినవే...
ఇనుము విరిగెనేని యిరుమారు ముమ్మారు
కాచి యతుక వచ్చు గ్రమముగాను
మనసు విఱిగెనేని మఱి చేర్చరాదయా
విశ్వదాభిరామ వినురవేమ...!
అంటూ వేమన రాసిన పద్యాన్ని చూస్తే 'మనసుకు బాధ కలిగించకుండా మనం ప్రవర్తించాలి' అనే విషయాన్ని ఎంత చక్కగా చెప్పారో అనిపించక మానదు.
ఉపకారికి నుపకారము
వివరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతీ!
అంటూ బద్దెన సుమతీ శతకంలో రాసిన పద్యం అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యాలంటూ అప్పుడే అసలైన మానవత్వం వికసిస్తుందంటూ చక్కగా చెబుతున్నది కదా!
'సదోష్ఠి సిరియు నొసగును
సదోష్ఠియె కీర్తి బెంచు సంతుష్టియు నా
సదోష్ఠియె యొనగూర్పును
సద్గోష్ఠియె పాపములను చెఱచు కుమారా!
అంటూ కుమార శతకంలో పక్కి అప్పల నర్సయ్య మంచి వానితో మాటలు, స్నేహము మనకు కీర్తిని, సంపదను ఇస్తాయి కాబట్టి మంచి వారితో స్నేహం చెయ్యమంటూ హితవు పలికారు.
ఇలా మన తెలుగు సాహిత్యంలో గల శతకాలలో సామాజిక స్పృహ మెండుగానే కనపడుతూ ఉంటుంది.
నాగరికతకు పుట్టినిళ్ళు నదీ తీరాలు
పవిత్రతకు చిరునామాలు పుణ్య క్షేత్రాలు ఆధ్యాత్మికతకు ఆవాసాలు గుడి గోపురాలు పురాణాలకు, ఇతిహాసాలకు ఆధారాలు చారిత్రక కట్టడాలు
పౌరుషానికి దిక్సూచీలు విజయ స్తంభాలు
విస్తృత దానాలకు దస్తావేజులు శిలాశాసనాలు
విదేశీ నాగరికతకు చిరునామాలు స్టాంపులు నీతులకు, లోక రీతులకు నిలయాలు శతకాలు
నైతిక ధర్మాలకు ప్రతి బింబాలు శతకాలు
సామాజిక స్పృహనందించే చైతన్య గీతికలు శతకాలు, సమాజ చైతన్యాన్ని కాంక్షించే పద్యాలు శతకాలు
మాతృ భాష తెలుగులో అధికం శతకాలు
తెలుగు భాషకు జీవం, బలమైన పద్య రూపంలో లభ్యమవుతున్న శతకాలలో సామాజిక స్పృహ మెండుగానే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శతకాలు నైతిక విలువలతో కూడిన సామాజిక స్పృహతో కూడిన పద్య కావ్యాలు.
రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ ::-- 82477433432