అమ్మా చదువులమ్మా వందనం ..ఆథ్యాత్మికం
అమ్మా చదువులమ్మా వందనం
(ఆథ్యాత్మికం)
రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ ::-- 8247433432
సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల వలనే విశ్వం మనగలుగుతోందని వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లకు ప్రేరణ శక్తిగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తి 'స్త్రీ'యని, ఆ స్త్రీయే ధన రూపంలో 'లక్ష్మీదేవి'లా, చదువుల తల్లి రూపంలో 'సరస్వతిదేవి'లా, జగన్మాత రూపంలో 'పార్వతీదేవి'లా పూజలందుకొంటున్నదని మన పూర్వీకులు, ప్రాజ్ఞులు చెప్పి ఉన్నారు. పురుషుని వెనకే కాదు అన్ని వైపులా తానే అయి ప్రపంచాన్ని విజయ పథం వైపు నడిపిస్తున్న 'స్త్రీ' శక్తిశాలినిగా, జగన్మాతగా, దుర్గాదేవిగా పూజలందుకొనే సంప్రదాయం మన భారతీయ సంస్కృతి లోనే ఉంది.
మన సాంప్రదాయాచారాలలో చదువులమ్మను పలువిధాలుగా పూజించటం, ప్రార్థించడం జరుగుతూనే వుంది.
'సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణనీ
నిత్యం పద్మాలయా దేవీ సామాం పాతు సరస్వతీ"
అంటూ ప్రతి వ్యక్తి తన జీవిత ప్రారంభ దశ అయిన విద్యార్థి దశలో విద్యను ప్రారంభించే సమయంలో ఈ శ్లోకాలు తప్పనిసరిగా నేర్చుకొంటారు. ప్రతి విద్యాలయంలోనూ ఈ శ్లోకాలు నిత్యం మననం జరుగుతూనే ఉంటాయన్న సంగతి అందరకూ తెలిసినదే.
అదే క్రమంలో అనాది కాలం నుంచి వినవస్తున్న ఈ శ్లోకం చూడండి.
"యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్రవస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాది చిరుత శంకర ప్రభృతిభిర్దేవై స్తబ్దుగా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ"
అనే శ్లోకాన్ని సభల ప్రారంభ సమయాలలో చదువుతుండటం పరిపాటిగా వింటూనే ఉంటాము.
చదువుల తల్లి సరస్వతీ దేవి వెలసిన దివ్య క్షేత్రమైన బాసరలోగల శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని గూర్చిన ఈ స్తోత్రం చదువుదాం..
'విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతి మాతరమ్!'
పంచామృతాభిషేకేన కామిత ఫలదాయికామ్
నైవేద్య నివేదనేన సకలార్ధ సాధికామ్
నీరాజన దర్శనేన సకలార్ధ సాధికామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్"
అంటూ కొనసాగిన ఈ స్తోత్రాన్ని రామదాసు రచించాడని చెబుతుంటారు.
అనాది కాలం నుంచి వేదాలలో, పురాణాలలో నిక్షిప్తమైయున్న సరస్వతిదేవిని గూర్చి ఈ కింద విధంగా పండితులు స్తుతించడం జరిగినది.
"సరస్వతీ త్వియం దృష్ణా వీణా పుస్తక ధారిణీ
హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరీమమ
ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవీ చతుర్ధం హంస వాహనా
పంచమం జగతీఖ్యాతం షష్టం వాణీశ్రీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిదాత్రీచ దశమం వరదాయిని
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువవేశ్వరీ
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వ సిద్ది: కరీ తన్య ప్రసన్నా పరమేశ్వరి
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ"
అని పేర్కొంటూ పండితులు చెప్పిన ద్వాదశ నామ స్తోత్రం ఎంతో ముఖ్యమైనది.
జానపదులు సరస్వతీదేవి గూర్చి చేసిన స్తుతి పద్యాన్ని చూడండి.
'"సరస్వతీ సతి మాకుచాలంగ నిమ్ము
పరమేష్ఠి రాణి మము పాలించవమ్మ
సలలిత మృధుపాణి యలి నీలవేణి
పల్లవారుణ పాద పరమ కళ్యాణి
సమ్మతిగ నినుగొల్తు సద్గుణ కదంబ
మమ్ము ధన్యుల జేయుమా శారదా" అనే పద్యాన్ని జానపదులు పాడుతుంటారు.
ఇక మన తెలుగు కవులు తమ కావ్యాలు రాసే ముందుగా ఇష్టదేవతా స్తుతి చెయ్యటం అనాదిగా పాటిస్తున్న
కవి సంప్రదాయం. ఆది కావ్యంగా పేరొందిన మహాభారతంలో నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన్న లు, తెలుగుల పుణ్యఫలకావ్యమైన ఆంధ్ర మహాభాగవతంలో పోతన, ఇలా అందరూ తమ తమ కావ్యాలలో ఇష్ట దేవతా స్తుతి చేస్తూ చదువుల రాణి సరస్వతీ దేవి గురించి పద్యాలను వ్రాసినట్లుగా ఆ కావ్యాల్లో మనకు కనపడుతూ ఉంది.
ఆంధ్ర కవితా పితామహుడుగా పేరొందిన అల్లసాని పెద్దన తన మను చరిత్రలో
"చేర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్లిచే
సింధూర తిలకంబు చెమ్మగిల్ల
నవతంస కుసుమంబు నందున్న యెలదేటి
రుతి కించి దంచిత శ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
దుంబీ ఫలంబు తుందుడుకు జెంద
దరుణాంగుళిచ్ఛాయ దంతపు సరకట్టు
లింగిలీకపు వింత రంగులీన
నుపనిషత్తులు బోటులై యోలగింప
బుండరీ కాసనమున గూర్చుండి మదికి
నించు వేడుక వీణ వాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయు గాత!" అంటూ ప్రార్థించాడు.
ఈ కవి సంప్రదాయాన్ని నేటి ఆధునికులు అప్పుడప్పుడు పాటిస్తూనే ఉన్నారు.
సమయం వచ్చివచ్చినప్పుడల్లా ఆ శారదామాతను తమ శక్తికొలదీ ప్రార్ధిస్తూనే యున్నారు.
"శ్రీవాణీ! కలభాషిణీ! కవి మనః శ్రీచక్ర సంచారిణీ !
బావా లోకనదాయినీ! రసధునీ! పాండిత్య మందాకినీ!
దేవా! నీకనుతాంఘ్రి పద్మ యుగళా! దేవీ! కళా మంగళా!
రావే! తెలుగు సమాఖ్య పండిత సభల్ రాజిల్లగా జేయవే!
అంటూ శాంతి శ్రీ జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి నుతించగా....
'"శ్రీ శారదా దేవి చిద్విలాసంబులే
వాల్మీకి వ్యాసుల వ్రాతలెల్ల
ఆ భారతీదేవి అనుగ్రహ దృక్కులే
కాళిదాసాదుల కవితలెల్ల
వాగ్గేవి పాదాల వన్నెల నడకలే
నన్నయాదుల నన్నె చిన్నెలెల్ల
వాణీ మహాదేవి వర భాషణంబులే
కవి వరేణ్యుల మేటి కైతలెల్ల
వివిధ విజ్ఞానములకామె పెద్ద దిక్కు
ఆమె కరుణింపకున్న నీ యవనిలోన
మనుజులందరు మృగములై మనగవలయు
కనుక మ్రొక్కెద నా దేవి కరుణగొరి" అంటూ
శ్రీధర సత్య వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రార్థించారు.
పై విషయాలన్నీ పరిశీలించగా సృష్టి స్థితి లయ కారకుల్లో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భార్య 'సరస్వతీ దేవి కరుణా కటాక్ష వీక్షణాల కోసం ప్రపంచం ఎదురు చూస్తున్న విషయం తెలుస్తోంది కదా! భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన అత్యంత ఉత్కృష్టమైన వరం వాక్కు...ఆ వాక్కులు అధిదేవత సరస్వతి దేవి. ఆ అమ్మ చదువులమ్మ కృపా కరుణా కటాక్షాలుంటేనే విజ్ఞానమనే శక్తితో ప్రపంచంలో గౌరవాదరాలు పొందుతారు. అందుకనే అమ్మ చదువులమ్మ ను నిరంతరం శరణు వేడుదాం.... జ్ఞాన భిక్షనిమ్మని ఆర్తితో అర్థిద్దాం.....
రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ ::-- 8247433432