గుండె తీసినంత పనయింది ( కథ )
గుండె తీసినంత పనయింది ( కథ )
“ అమ్మా..అమ్మా..”
“ ఏట్రా ..నీ గోల..” విసుక్కుంది సూరమ్మ పొయ్యి మీద కూడు ఉడికిందో లేదో అని చూస్తూ.
“ నాను ఏడో క్లాసు పాస్ అయినాను కదా.. అప్పుడు నువ్వేటన్నావ్..” నెమ్మదిగా అడిగాడు దేవుడు
“ నానేటి అన్నాను రా ..” ఆశ్చర్యపోయింది సూరమ్మ
“ సిమ్మాద్రి అప్పన్న కొండకు తీసుకెల్లి తల తీయిత్తానన్నావు కదా..”
“ అవును రోయ్ …మర్సిపోనాను ..ఈలు సూసుకుని ఎల్దాం లే “ ప్రేమగా చెప్పింది సూరమ్మ. ఆనందంతో తెగ పొంగిపోయి ఆడుకోవడానికి పారిపోయాడు దేవుడు.
* * *
ఉత్తరాంధ్రా లో ఒక చిన్న పల్లెటూరు !
అందరూ కలుపుగోలుగా , చేదోడు వాదోడు గా , సరదాగా సాగిపోయే వాతావరణం. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ , ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటూ ప్రేమాభిమానాలతో అలరారే గొప్ప సంఘీభావం ఆ ఊళ్ళో !
రైతు కూలీలు సూరమ్మ , నాగయ్య ల ముద్దుల కొడుకు దేవుడు . తాము పొలం పనులు చేసుకునే కూలీలు గా కష్టపడుతున్నా కూడా కొడుకుని మాత్రం బాగా చదివించాలని తాపత్రయపడుతుంటారు ఆ దంపతులు. వాళ్ళ ఆశ కు తగ్గట్టే బుద్ధిగా చదువుకుంటున్నాడు దేవుడు. ఒక పక్క చదువు , ఇంకో పక్క ఆటపాటలతో అందంగా గడిచిపోతున్న బాల్యం అతనిది.
ఇంటి పనులు అన్నీ అయ్యాక , సూరమ్మ తమ ఇంటికి దగ్గర్లో ఉన్న అంకమ్మ దగ్గరికి వెళ్ళింది .
“ అప్పా.. బొట్టుడు కొండకు తీసుకెల్లమంతన్నాడు ..తల తీయించాల ...సేతిలో పైసా నేదు..ఏటి సేసీది “ అని చెప్పుకుంది
అంకమ్మ చిన్నగా నిట్టూర్చి “ నా దగ్గరా నేవు..మీ బావ సన్నాసి ని అడుగుతాను “ అని భరోసా ఇచ్చింది. ఆ చిన్న మాట సాయానికే సంతోషపడిపోయింది సూరమ్మ. అప్పుడే ఇంటికొచ్చిన అంకమ్మ భర్త సన్యాసి “ ఏటి మరదలా ..ఏటి సెపుతుంది మీ అప్ప …నా పెతాపమేనా ..” అంటూ హాస్యమాడాడు.
“ నీ ఇసయం కాదునే బావా..వేరే ఇసయం..అప్ప నీకు సెపుతాదిలే “ అని నవ్వేసి అక్కడి నుండి వచ్చేసింది సూరమ్మ.
* * *
పొద్దుట జనాలంతా పొలం పనులకు కదులుతున్నారు. ఉదయ భానుడు నెమ్మదిగా తన వేడి చూపించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. తల నున్నగా దువ్వుకొని , షర్ట్ , నిక్కరు వేసుకుని కాళ్ళకు రబ్బరు చెప్పులు తొడుక్కున్నాడు దేవుడు. వాడిని చూసి మురిసిపోయింది సూరమ్మ.
నాగయ్య , భార్యను చూస్తూ "జాగరత గా ఎల్లి రండి. సానా మంది జనం ఉంతారు అక్కడ ...పిల్లాడు జాగరత.. ఈ పొలం పని నేకపోతే నానూ వచ్చీవోడినే..సరే ..పోయి రండి "అని బస్ ఎక్కించాడు. బస్ లో సీట్ దొరికింది వాళ్ళకి. కిటికీ పక్కన కూర్చుని బయట కు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళ ఊరి నుండి దాదాపు రెండు గంటల ప్రయాణం చేస్తే సింహాచల దేవస్థానం వస్తుంది. సూరమ్మ చిన్నగా కునుకు తీయడం మొదలెట్టింది.
దేవుడు దారి పొడుగునా వచ్చే ఊళ్ళని, ఎక్కీ దిగే వాళ్ళని చూస్తూ టైము గడిపేస్తున్నాడు. ఇంతలో ఎవరో ఆసామి చుట్ట వెలిగించి పొగను గుప్పు గుప్పున వదులుతున్నాడు. బస్ అంతా ఒకటే వాసన. కండక్టర్ "ఓయ్ ..పెద్దాయనా ...చుట్ట కాల్చడం ఆపెయ్.. బస్ లో పొగ త్రాగకూడదు "అని అరిచాడు.
"అట్టాగే బాబూ..ఒక్క సిటం .."అని కిటికీ లో నుండి తుపుక్కున ఉమ్మాడు ఆ ఆసామి.
అతని పక్క సీట్లో కూర్చున్న ఒక కాలేజీ కుర్రాడు "ఛీ ..ఛీ.. కంట్రీ బ్రూట్ "అని తిడుతున్నాడు. ఆ మాటలు ఆసామి చెవిన పడ్డాయి. "ఏటి బాబూ తిడతన్నావు.. బూటా ..అంతే ..ఏటర్ధం.. ఇంగిలిపీసు మాకూ వచ్చు ..బూటట ..బూటు.. ఎక్కువ నీలిగితే తన్నీగలను "అని రాగాలు తీస్తున్నాడు. కాలేజీ కుర్రాడు చిరాగ్గ మొహం తిప్పుకున్నాడు. ఎవరో చిన్న పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. వాడి తల్లి "ఓరి ఊరుకోరా నువ్వు.. ఎక్కిన దగ్గిర్నిండి ఒకటే గోల.. పాలు తాగమంటే తాగడు "అని దగ్గరకు తీసుకుంది. ఇలా ప్రయాణం సాగాక..
"సిమ్మాచలం..సిమ్మాచలం.. సిమ్మాచలం బస్టేండ్ ! "అని కండక్టర్ అరవడంతో అందరూ సీట్ల లో నుండి లేచి దిగడానికి సిద్ధమయ్యారు. సూరమ్మ కూడా దేవుడు ని ఒక చేతితో గట్టిగా పట్టుకుని ఇంకో చేతితో సంచీ పట్టుకుని రడీ అయింది. బస్టాండ్ లో బస్ దిగాక , సింహాద్రి కొండపైకి వెళ్ళే బస్ ల వైపు కదిలారు వాళ్ళిద్దరూ. అక్కడ రడీ గా ఉన్న దేవస్థానం బస్ లో కూర్చుని టికెట్ తీసుకున్నారు. దేవుడు కి ఇదంతా చాలా సంబరంగా ఉంది. మనసు ఆనందంతో నిండిపోయింది. ఎప్పుడో తప్ప అతను ఇలా దూర ప్రయాణం చెయ్యడు. ఈ విధంగా తల్లితో పాటూ రావడం అతనికి గొప్ప ఆటవిడుపు గా ఉంది. పైగా తాను చూస్తున్న కొత్త ప్రపంచం మరింత థ్రిల్ ఇవ్వసాగింది. బస్ కొండ మీదికి వెళుతోంది. ఎత్తుకు వెళుతున్న కొలదీ భార రహితంగా ఫీల్ అయ్యాడు దేవుడు. రోడ్డు పక్కన అక్కడక్కడ కనిపిస్తున్న కోతులు భక్తులు ఇచ్చిన అరటి పళ్ళు తింటూ హడావుడిగా గెంతుతున్నాయి. చిక్కటి కొండను తొలిచి వేసిన ఘాట్ రోడ్డు. బాగా వంపులు తిరిగి ఉంది. ఆ వంపులన్నీ తిరిగి కాసేపటికి బస్ కొండ పైకి చేరుకుంది. భక్తుల జయ జయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతోంది. సూరమ్మ , కొడుకుని దగ్గరగా తీసుకుని క్యూ లైన్ లో నిలబడింది. క్యూ నెమ్మదిగా కదులుతోంది.
క్యూ లో ముందున్న ఒకామె , సూరమ్మ ను చూస్తూ "ఏ ఊరమ్మా మీది .."అని డిగింది
సూరమ్మ చెప్పి "మీదమ్మా .."అని అడిగింది.
"అనకాపల్లి అమ్మా.. అప్పలమ్మ నా పేరు "అని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు . క్యూ లైన్ బాగా కదిలింది. గర్భ గుడి దగ్గరకు రాగానే భక్తిగా దండం పెట్టుకున్నారు సూరమ్మ, దేవుడు. తర్వాత బయటకు వచ్చేసారు. మనశ్శాంతి గా అనిపించింది దేవుడు కి. "నాకు బాగా చదువు ఇవ్వు సామీ"అని మొక్కుకున్నాడు. బయటకు రాగానే కళ్యాణ కట్ట వైపు కొడుకుని తీసుకెళ్ళింది సూరమ్మ. కూర్చో బెట్టి నున్నగా గుండు కొట్టించింది. "అమ్మా ..గుండు మండిపోతంది "అని దేవుడు ఏడుస్తుండటంతో అక్కడే అమ్ముతున్న గంధం పూయించింది గుండుకి. "ఇప్పుడు సల్లగా ఉందమ్మా "అని నవ్వాడు దేవుడు.
ఇద్దరూ గుడి ప్రాంగణం లో తిరగసాగారు. కొందరు గ్రామీణులు ఆబోతు ని మధ్యలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ తప్పెటగుళ్ళు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఇంకొక రైతు లాంటి వ్యక్తి చేతిలో దివిటీ పట్టుకున్నాడు. అందులో మంట బాగా వెలుగుతూ , గాలికి అటూ ఇటూ కదులుతోంది. . సింహాద్రి అప్పన్నకు అంకితం చేయడానికి ఆ ఆబోతు ని తమ ఊరి నుండి తీసుకు వచ్చారు గ్రామీణులు. తమ ఊరి దగ్గర మొదలుపెట్టి ఆబోతు ని నడిపించుకుంటూ దారి పొడుగునా పాటలు పాడుకుంటూ సింహాద్రి కొండకు తీసుకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ పూర్తయ్యాక దాన్ని గోశాల కు సమర్పించి తిరిగి వెళ్ళిపోతారు. సూరమ్మ , దేవుడు ఆ వేడుకను చూడసాగారు. ఇంతలో అప్పలమ్మ కనబడింది. సూరమ్మ పక్కకు వచ్చి ఆమెతో మాటల్లో పడిపోయింది. ఆ ముచ్చట్లన్నీ అయి , అప్పలమ్మ వెళ్ళిపోయాక కొడుకు కోసం చూసింది సూరమ్మ. కానీ దేవుడు దగ్గర్లో ఎక్కడా లేడు. గుండె ఆగినంత పనయింది సూరమ్మకు. !
* * *
"దేవుడూ.. ఒరే దేవుడూ " , " ...బాబూ.. మా బొట్టుడిని సూసారేటి ...తెల్లగా ..పొట్టిగా ఉంటాడు .."అని అందరినీ కంగారు కంగారుగా అడుగుతోంది సూరమ్మ.
"సూడనేదమ్మా .."అని సమాధానం చెబుతున్నారు అందరూ. గుండె గాభరా పెరిగిపోయింది సూరమ్మకి. "ఆ ఎదవ ముండ అప్పలమ్మ మాటల్లో పెట్టీసింది....ఈనోగా గుంటడు ఎటు పారిపోనాడో "అనుకుంటూ కలగా పులగంగా తిరగసాగింది. తనను తానే తిట్టుకోసాగింది. పశ్చాత్తప్పడసాగింది. తన మొగుడు నాగయ్య తిట్టే తిట్లు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. కళ్ళు తుడుచుకుని వెదుకుతూ అలా తిరుగుతోంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి విషయం కనుక్కుని పబ్లిక్ ఎడ్రసింగ్ సిస్టం లో ఎనౌన్స్ మెంట్ కూడా చెయ్యించాడు. అయినా ఫలితం కనబడలేదు.చాలా సేపు వెదికాక , కొడుకు కొండ దిగి వెళ్ళిపోయాడేమో అని అనుమానం వచ్చింది సూరమ్మకు.
ఏదయితే అది అయిందని సూరమ్మ , ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్ళి "బాబూ.. నేను కొండ కిందకి ఎల్లి మా గుంటడిని ఎతుకుతాను.. నీకు గానీ కనబడితే ఆడ్ని నీ దగ్గిరే ఉంచుకో నాయనా .."అని చెప్పి కొండ కిందకు వెళ్ళే దేవస్థానం బస్ ఎక్కింది. కొడుకు దొరకాలని సింహాద్రి అప్పన్నకు మనసులోనే గట్టిగా వేలసార్లు వేడుకొంది.
కింద బస్టాండ్ లో బస్ దిగగానే అంతటా వెదకడం మొదలు పెట్టింది. అక్కడ షాపులు పెట్టుకున్న వర్తకుల దగ్గరకు వెళ్ళి గుచ్చి గుచ్చి అడగసాగింది. అయినా ఎవరూ తాము చూసామని చెప్పడం లేదు. అడిగి అడిగి అలసి పోయి , పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మ మీద కూర్చొని ఏడ్వసాగింది. కొడుకుని అనవసరంగా తీసుకు వచ్చానని బాధ పడసాగింది. చుట్టూ జనాలు ఎవరి గోలలో వారు ఉన్నారు. ఎవ్వరూ సూరమ్మని పట్టించుకోవడం లేదు.
రక రకాల ఆలోచనలు సూరమ్మను చుట్టుముడుతున్నాయి. కొంపదీసి తన కొడుకు కొండ పైన ఉన్న అడవుల్లోకి తప్పిపోలేదు కదా అన్న అనుమానం వచ్చింది. అదీ కాకపోతే ఎవరైనామాయమాటలు చెప్పి తమతో తీసుకుపోయారా అన్న అనుమానం కూడా కాసేపు కదిలింది . ఆ బాధతో గుండెల్లో సన్నగా నొప్పి లాంటిది మొదలై చచ్చినంత పనైంది. చేజేతులా కొడుకుని పోగొట్టుకున్నానన్న వ్యధ ఆమె గుండెని తొలిచేయసాగింది. సమయం గడుస్తున్న కొద్దీ కొడుకు ఆచూకీ తెలీకపోవడంతో ఉన్న ఆశ కాస్తా పోయింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలన్నంత జ్ఞానం లేదామెకి. నిరక్షరాస్యురాలు. ఏ సమస్య వచ్చినా దేవుడి మీద భారం వేసి ఊరుకోవడమే తెలుసు. స్తబ్దమైన ఆమె మెదడు ఇక ఆలోచించే శక్తి ని కోల్పోయింది. ఏం చెయ్యాలో పాలుపోక , ఇంటికి వెళ్ళి తన భర్త తో బాధ పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు మొగుడు నాగయ్య తన ప్రాణం తీసినా ఫర్వాలేదు అనుకుంది. తమ ఊరికి వెళ్ళే బస్ ఎక్కి సీట్లో నిస్సత్తువగా కూలబడింది.
బస్ కదులుతూ వెళ్తోంది.. కానీ సూరమ్మ మనసు మాత్రం కొడుకు కోసం వెదుకుతూ సింహాద్రి కొండపైనే ఉండిపోయింది.
'ఎంత సక్కటోడో నా కొడుకు ...ఎటు పోయినాడో 'అని ఆమె మనసు శోక గానం చెయ్యసాగింది. దేవుడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆమె కళ్ళ ముందు కదిలింది.
ఒక రోజు సాయంత్రం ఆడుకోవడానికి ఫ్రెండ్స్ తో వెళ్ళిన దేవుడు , చీకట్లు ముసిరినా కూడా ఇంటికి రాలేదు . సూరమ్మ కంగారు పడి అందరినీ వాకబు చేసింది. ఎవరూ చెప్పలేదు గానీ , చివరికి తమ ఇంటికి దగ్గర్లోనే ఉండే బంగారమ్మ చెప్పింది. "అప్పా.. ఇందాక నాను సెరువు నుండి కుండతోని నీల్లు తెత్తుంటే ...కనబడినాడు ...ఆడు ఆడుకోడానికి ఇసిరిన రాయి నా కుండకు తగిలీసింది. ఉండరా గుంటడా నీ యమ్మ తోటి సెపుతాను అని బయపెట్టీసినాను.. అమ్మో అని పారిపోనాడు.. "అని బాంబ్ పేల్చింది. సూరమ్మ గుండెల్లో రాయి పడింది. పిల్లాడు ఎక్కడికి పారిపోయాడో అని ఆ చీకట్లో పొలాల్లోకి, కల్లాల్లోకి వెళ్ళి గట్టిగా అరిచి పిలిచింది. అయినా వాడు పలకలేదు. ఏడ్చుకుంటూ ఇంటికి వస్తూ ఆ సందె చీకట్లో గొడ్ల చావిడి దగ్గర ఏదో నీడ కదులుతూ ఉండటంతో దగ్గరకు వెళ్ళింది. చూస్తే ...కొడుకు దేవుడు! ఆమెను చూసి "అమ్మా ...నన్ను కొట్టకే.. నేను ఏటీ సెయ్యనేదు.. "అని భయపడిపోతున్నాడు. సూరమ్మ కొడుకుని దగ్గరకు తీసుకుని "నా కొడుకే ..బయపడమాక ...రా ఇంటికి "అని తీసుకొచ్చి ఊరుకోబెట్టింది. బంగారమ్మ చెప్పిన మాటలు విని తనని తల్లి కొడుతుందేమో అని భయపడి గొడ్లచావిడి లో దాక్కున్నాడు దేవుడు.
అలా అప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చి, కొడుకు మెతకదనం తల్చుకుని ఇంకా ఏడ్వసాగింది సూరమ్మ. బస్ ఊళ్ళోకి ప్రవేశించగానే దిగి , ఇంటి వైపు భారంగా కదిలింది. ఇంట్లోకి వెళ్ళిన సూరమ్మకి అక్కడ కనబడిన దృశ్యం చూసి ఆనందంతో గుండె ఆగినంత పనయింది.
"అమ్మా..అమ్మా.. నన్ను ఒగ్గీసి ఎటు ఎలిపోనావు "అని అడుగుతూ ఎదురుగా దేవుడు. ఒక్కసారిగా వాడ్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. భర్త నాగయ్య "ఊరుకోయే.. అందుకే జాగరత అని సెప్పినాను "అని భుజం మీద ఓదార్చాడు.
పక్కనే ఉన్న అప్పలమ్మ "అప్పా.. నీ కంటే ముందే నాను కొండ కిందకొచ్చీసినాను కదా ...ఇంకా బోల్డు టైము ఉందని అలా అడివ్వరం దగ్గరికి ఎల్లాను..అక్కడ నీ బొట్టుడు ఏడుస్కోని తిరగతన్నాడు.. నీ అమ్మేదిరా అంతే 'నాకు తెల్దు 'అని సెబుతున్నాడు. నాకు ఎందుకో అనుమానం వచ్చీసినాది. 'ఇక్కడిదాకా ఎలా వచ్చినావురా 'అంతే 'ఆబోతుని తోలుకుంతూ గోసాల ఏపు ఎల్తన్న మనుసులతో నడుసుకుంటూ వచ్చీసానని 'సెప్పాడు. నాకర్దమైపోనాది - ఆడు నిన్ను ఒగ్గీసి వచ్చీసినాడని. నీ కోసం సూసి సూసి నేనే మీ ఊరికి తీసుకొచ్చీసాను. పోనీనే నువ్వూ వచ్చీసినావు... అదే సాలు ...సరే ..నేను అనకాపల్లి పోతా..సీకటవుతాంది "అని చెప్పింది అప్పలమ్మ. సూరమ్మ, నాగయ్య లు చేతులెత్తి ఆమెకు నమస్కరిచారు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది అప్పలమ్మ.
తర్వాత …కొడుకుని పట్టుకుని అలాగే కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది సూరమ్మ. ఆ అప్పన్నసామి దయ వల్ల కొడుకు కి ఏమీ కాలేదని సంతోషపడింది.కొడుకుకి తల తీయిద్దామని అప్పన్న కొండకు తీసుకెళ్తే , తన గుండె తీసినంత పనయిందని చిన్నగా నవ్వుకుంది సూరమ్మ. !!
రచన: డా. సన్నిహిత్
Address :
Dr. Sannihith
H.no.18-8-254/A/1/57
Bharata ratna coclony
Kanchanbagh (post)
Hyderabad -500058
obile : 9490956012
Mail id : sanhith139@rediffmail.com