BREAKING
గంగాయైనమః నీరే జీవనాధారం – నీటి సంరక్షణ మనందరి బాధ్యత (వ్యాసం) పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, హైదరాబాద్‌లో మళ్లీ భారీగా తగ్గిన బంగారం మరియు వెండి ధరలు యాపిల్ సేవల్లో భారీ సాంకేతిక అంతరాయం.. జీమెయిల్ (Gmail) వినియోగదారుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు! ద్రవ్యోల్బణం తగ్గకపోతే మరోసారి వడ్డీ రేట్ల పెంపు తప్పదు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి సంచలన హెచ్చరిక! బ్రిటన్ – యూరోపియన్ యూనియన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదన.. శుక్రవారం కీలక చర్చలు! అమెరికా షేర్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మరింత పెరుగుదల.. భారీ నష్టాల్లో ముగిసిన ప్రధాన సూచీలు! కెనడా డాలర్ 19 నెలల కనిష్ఠానికి సమీపంలో.. చమురు ధరల్లోనూ పెరుగుదల! ఇరాన్‌లోని కేష్మ్ దీవిలో క్షిపణి ప్రయోగ స్థావరంపై అమెరికా వైమానిక దాడి.. సౌదీ అరేబియా చమురు పైప్‌లైన్‌పై ఐదు డ్రోన్లతో దాడి చేశామని ప్రకటించిన హూతీలు అర్ధరాత్రి వేళ వైన్స్‌లో దొంగల హల్‌చల్ మోల్డోవా గగనతలంలోకి చొరబడిన రష్యా డ్రోన్లు.. రాజధాని చిసినౌ మీదుగా ఒక డ్రోన్ వెళ్లిందని అధ్యక్షురాలు మయా సాండు వెల్లడి! ఉక్రెయిన్ యుద్ధ వ్యూహంపై అమెరికా – జర్మనీ – బ్రిటన్ మధ్య తీవ్ర విభేదాలు.. సైనిక సాయం, దౌత్య మార్గాలపై భిన్నాభిప్రాయాలు! చైనాలోని షెన్‌జెన్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్‌తో కీలక త్రైపాక్షిక సమావేశానికి సన్నాహాలు! ఏపీఈసీ సదస్సులో తైవాన్ ప్రతినిధి కీలక ప్రణాళిక ఐరోపాలో రెండో అత్యధిక నిధుల ప్రవాహంతో దూసుకుపోతున్న స్టార్టప్‌లు

గంగాయైనమః నీరే జీవనాధారం – నీటి సంరక్షణ మనందరి బాధ్యత (వ్యాసం)

Select Suryaa Now
గంగాయైనమః నీరే జీవనాధారం – నీటి సంరక్షణ మనందరి బాధ్యత (వ్యాసం)

""గంగాయైనమః""(వ్యాసం)
‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 
‎సెల్.. 8247433432
‎‎""నమశ్శివాయై గంగాయై శివధాయై నమోనమః 
‎నమస్త్రిపధగామిన్యై విశ్వమూర్యై నమో నమః " ఇలా సాగుతూ ఉంటుంది గంగాప్రార్థన. గంగ అంటే కేవలం ఒక్క గంగానదినే తీసుకోకూడదు. గంగను నీరు అనే అర్థంలో వాడుతున్నారు కదా! నీరు జీవనాధారానికి మూలం. నీరు ప్రాణికోటికి ప్రాణాధారం అందుకే చాలామంది నీటికి "ప్రాణధారాయైనమః"అని నమస్కరిస్తుంటారు.
‎నీరు, ఉదకం, జలం, జలకం, సలిలం, తోయము, అంబువు, వారి, అపస్, మేఘజం, పానీయం, అమృతం అనే పర్యాయపదాలుగా చెబుతుంటారు. వాటర్, పానీ, తన్నీర్, అంటూ ఇతర భాషలలో పిలుస్తుంటారు. 
‎జలమే జగతికి ఆధారం. జలమే జగతికి మూలం. అటువంటి జలాన్ని "పృధివ్యాపస్తేజోవాయురాకాశః" పంచభూతాలలో ఒకటని ఆర్యులు చెప్పారు కదా! మనం కూడా అనాది కాలం నుండి పూజిస్తునే వున్నాం కదా! సాధువుల నుంచి సామాన్యుల వరకూ ప్రతీ నిత్యం పర్వదినాలలో సముద్రాలు, నదులలో, కాలువలలో నీటి వనరులున్న చోట స్నానాలు చేసి భగవంతునికి అర్ఘ్యం ఇస్తుంటారు కదా! 
‎అదే విధంగా మన ఇండ్లలో ఏదైనా పూజా పునస్కారాలు చేసేటప్పుడు ఒక చిన్న పాత్రలో మన పరిసరాలలో దొరికే నీరు తీసుకుని 
‎"గంగేచ యమునేచైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ " అంటూ మంత్రం చెప్పుకొంటూ ఆ నీటికి పైన చెప్పిన నదుల పవిత్రతను ఆపాదించుకొంటున్నాం కదా ! అంటే మన వీధి చెరువులలోంచి మున్సిపాలిటీ పంచాయితీ కుళాయిల ద్వారా వచ్చే నీటిని మనం ఆ విధంగా పవిత్రంగా భావిస్తున్నాం కదేంటండీ! చూసారా! 
‎మన సనాతన ధర్మం ఎంత గొప్పదో? 
‎ఎంత ఆచారమైనదో? 
‎మనం చేసే ప్రతి పనికి పవిత్రత ఆపాదించుకొంటున్నాం.
‎అదే కదా! సంప్రదాయం అంటే? 
‎ప్రాణులకు జీవశక్తినిచ్చే నీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో కదా! 
‎అటువంటి నీరు మూడు రకాలుగా ఘన రూపంలో (మంచు), ద్రవ రూపంలో (సముద్రాలు, నదులు, కాల్వలు), వాయు రూపంలో (మేఘాలు,ఆవిరి) లభిస్తోంది.
‎ద్రవరూపాలుగా (సముద్రాలు, నదులు, కాల్వలు, చెరువులు, నీటి కుంటలులో) వున్న నీరు సూర్యరశ్మి వలన వేడెక్కి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా, మబ్బులుగా మారిపోతుంది. మరలా చల్లని గాలులకు మేఘాలు, మబ్బులు కరిగి వర్షంలా కురిసి నీరులా మారుతోంది కదా! 
‎దీనిని నీటి చక్రం అంటారని సైన్స్ చెబుతోంది కదండీ! ఇది నిరంతరాయంగా ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగే చర్య. ప్రకృతి మనకు సహజ సిద్ధంగా ఉచితంగా అందించే జీవనాధారమైన వనరులలో అతి ముఖ్యమైనది నీరు. కాదంటారా? ఎవరైనా? నీరు దేవుడు ప్రాణికోటికి ఇచ్చిన ఓ అద్భుతమైన వర ప్రసాదం. అవునా? కాదా? చెప్పండి. నీరు తాగటానికి, వివిధ రకాల గృహావసరాలకు, వాడుకోవడానికి, సాగు చేసుకోటానికి ఉపయోగించే అమూల్యమైన వనరు. నీరు ఉంటేనే మన ఉనికి, మనుగడ. ప్రాణికోటి సమస్తానికి జీవాన్ని, బలాన్ని, తేజస్సును, ఓజస్సును ఇచ్చేది నీరే కదా!
‎సైన్సు లో నీటిని సాంకేతిక నామం గా "హెచ్ 2 ఓ" అంటారు.
‎సమస్త చరాచర జీవకోటికి ప్రాణాధారమైన నీరు వుండే ప్రాంతాలలోనే ప్రగతి, నాగరికత కనిపిస్తుంటాయి ఎడారి భూముల్లో, బీడు వారిన చౌడు నేలల్లో మొక్కలు ఏం మొలుస్తాయి? ఏ పశువులు తిరుగుతాయి? చెప్పండి.
‎మీరు గమనించండి. చరిత్రలో మనం చదువుకున్న సింధు నాగరికత, హరప్పా నాగరికత, విజయనగర సామ్రాజ్య వైభవాలు, మొదలైన నాగరికతలు ఇవన్నీ నదీతీర ప్రాంతాలలోనే విలసిల్లినవి కదా! ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, కళా, వారసత్వ సాంప్రదాయాలను, నాగరికతలను మానవ ప్రగతికి అందించినవి నదీ తీరప్రాంతాలే కదా! మరి అలనాటి సంప్రదాయాన్ననుసరించే నేటికీ గంగ, గోదావరి, కృష్ణ, మొదలైన నదీమతల్లులకు నిత్యం హారతులు ఇవ్వటం, పుష్కరాలు, కుంభమేళాలు నిర్వహిస్తూ,
‎ఆధ్యాత్మిక వాతావరణాన్ని నేటి సమాజానికి అందిస్తున్నారు. 
‎అటువంటి నీటి వనరులను నేటి కాలంలో ఎలా దుర్వినియోగపరుస్తున్నారో చూడండి. వివిధ రకాల కాలుష్యాలు, చెత్తా చెదారాలు, వ్యర్థాలు, ఒక్కటేమిటి అన్నిటినీ నీటి వనరులలో పారేయడం, ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థలు మొదలుగా హోటళ్ళు , ధియేటర్స్, మొదలైన జన సముదాయాలు, ఇళ్ళులు, సాగుబడి చేస్తున్న వ్యవసాయ క్షేత్రాలు, ఇంకా ఇతర పశువుల, జంతువుల కేంద్రాల వారు ఒకటేమిటి? ఇంచుమించుగా అందరూ అన్ని విధాలా వాడకం నీటిని నదులలో, కాలువలలో, చెరువులలో వదిలేస్తున్నారు. అదీ కాకుండా మిగిలిన పోయిన, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, కూరగాయలు ఒకటేమిటి? మనకు అక్కరకురాని వాటితో పాటు జంతు కళేబరాలు, చెత్తా చెదారాలు, ప్రతీ రోజూ అదే పనిగా నీటి ప్రవాహాలలో  పారేయడం అలవాటు అయిపొయింది. అంతే కాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, క్యారీ బాగులు
‎రకరకాల రూపాల్లో వివిధాలుగా ఉపయోగించేసుకున్న ప్లాస్టిక్ ను నీటి వనరులు,  ప్రవాహాలలో విచ్చలవిడిగా 
‎పారేస్తున్నారు. ఇలా మంచినీటి వనరులను మురికి కూపాలుగా మార్చేస్తున్నారు మానవులు తమ వికృత చేష్టలతో. తాగే నీటి ప్రవాహాలను ఈవిధంగా వ్యర్థాల మురికి గుంటలుగా తయారుచేసేస్తుంటే బలవర్థక పోషకాలు, సరైన లవణాలు, హాని రహిత ఆరోగ్యకరమైన మంచినీరు ఎక్కడినుంచి దొరుకుతుంది చెప్పండి? భూమండలం మీద 71 శాతానికి పైగా ఆవరించి ఉన్న మంచినీరు ఈరోజుల్లో తాగటానికి ఒక్క మంచినీటి బిందువు సరిగా దొరకటం లేదు అని చెప్పుకోవచ్చు. జీవుల్లో జీవ రసాయన ప్రక్రియలన్నీ దోహదపడే నీరు జంతువుల శరీరంలో సుమారుగా 70 నుంచి 90 వరకూ, మనిషి శరీరంలో 2/3 వంతుగా వున్న నీరు శరీరంలో రవాణా సౌకర్యాలు కలిగిస్తూ, శరీరంలో వుండే పనికిరాని చెత్తను, మలినాలను బయటికి పంపేస్తూ మన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడే నీరు స్వచ్ఛంగా ఎక్కడ దొరుకుతోందో చెప్పండి? అసలు మనం తాగే ఒక లీటరు నీటిలో ఇనుము ఒక మిల్లీ గ్రాము శాతం కన్నా ఎక్కువ వుండకూడదు. అదే విధంగా లీటరు నీటిలో నైట్రైట్ కణాలు సున్నా శాతం, నైట్రేట్ వంద మిల్లీ గ్రాముల మించివుండకూడదంటూ, లీటరు నీటిలో రెండు వేల వరకూ వివిధ రకాల ఖనిజాలు వుంటే ఆ నీరు తాగటానికి మంచిదని ఆరోగ్య శాస్ర్తవేత్తలు, వైద్యులు చెబుతున్నారు కదా! గమనించండి ఏదైనా అనారోగ్య సమస్యలతో వైద్యుల దగ్గరకు వెళితే మనం తాగే నీటి గురించి ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారా లేదా? నీటి వలనే కదా సీజనల్ వ్యాధులు, హెపటైటిస్ మొదలైన ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయని ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి కదా! 
‎అందుకనే నీటిని కాచుకొని తాగండి అని డాక్టర్లు చెబుతున్నారు కదా! 
‎జలమే కదా జగతికి ప్రాణాధారం, 
‎జలమే ప్రగతికి మూలాధారం. 
‎అటువంటి నీటిని మనం చేస్తున్న వివిధ రకాలైన అనాలిచితాలైన వాటివలన తాగటానికి పనికిరాకుండా చేసేస్తున్న వివిధ కారణాల మూలంగానే నీటిని కొనుక్కుని తాగుతున్నాం కదా! స్వచ్ఛమైన పచ్చదనాలు వెల్లివిరిసే పల్లెల్లో కూడా వాటర్ ప్లాంట్స్, వాటర్ ఫౌండేషన్స్ పేర్లతో నీటిని అమ్మేస్తున్నారు. ప్రతీ ఇంట్లో రివర్స్ ఆస్మోసిస్(ఆర్వో) నీళ్ళే తాగుతున్నారు కదా! చాలా విచిత్రమేమంటే ఇంట్లోంచి బయటకెళ్ళే ప్రతీ వ్యక్తి నీళ్ళు ఎవరూ పట్టుకెళ్ళడం లేదు కదా! నిజాయితీగా మాటాడుకుంటే నూటికి తొంభై శాతం మంది వాటర్ బాటిల్స్ కొనుక్కుని కొద్దిగా తాగేసి మిగిలిన నీటిని ప్లాస్టిక్ బాటిల్స్ తో సహితంగా పారేస్తున్నారు కదా! దీని వలన రెండు రకాల ఇబ్బందులు వున్నాయి జాగ్రత్తగా గమనించండి డ్రింకింగ్ వాటర్ పాకెట్స్, బాటిల్స్, కేన్స్ లో ఏ నీళ్ళు ప్యాక్ చేస్తారో? ఏ వాతావరణంలో ప్యాక్ చేస్తారో? 
‎తయారు చేసిన తేదీలు, ఏ తేదీలోగా వాడాలి? అనే విషయాలు కూడా గమనించకుండా అదో ప్యాషన్ గా కొనుక్కోడం, తాగేయడం, పారేయడం చేస్తున్నారు. దాని వలన ఆరోగ్యం పాడవటమే కాకుండా నీటిని వృధా చేయడం కూడా జరుగుతోంది. ఇలా చేసుకొంటూ పోతుంటే సముద్రాలు, నదులు, కాలువలు, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ పూడుకుపోయి, ప్రవాహాలు ఆగిపోయి, వరదలు, ముంపులు, వాటితో రకరకాల ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ మనమే మన చేతులారా కొనితెచ్చుకుంటున్నాం కదా! ఒక్కసారి ఆలోచించండి మనం ఇంట్లో తాగే నీటిని మన కూడా పట్టుకెళ్ళడం వల్ల కొంతవరకూ ఇబ్బందులు తొలగించినవారమవుతాము కదా! ఇది మనందరి సామాజిక బాధ్యత కాదంటారా? అపార్ట్మెంట్ కల్చర్ లో బతుకుతున్నాం కదా! ఎన్ని నీళ్ళు వృధా అవుతున్నాయో ఎప్పుడైనా గమనించారా? సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలనీ పరిశోధకులు చెబుతున్నారు. ఇంక స్నానాలకు, బట్టలు ఉతకటానికి, పాత్రలు శుభ్రం చేయడానికి ఇలాంటి తదితర గృహ అవసరాలకు సగటున నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకీ సుమారుగా వంద లీటర్ల నీరు అవసరం వుండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయాలను బట్టి చూస్తే అపార్ట్మెంట్ లో వారు ఎన్ని నీళ్ళను అనవసరంగా వృధా చేస్తున్నారో గమనించగలరు. నేడు మీరు చేసే నీటి పొదుపే రేపటి మీ పిల్లలకు మీరిచ్చే పెద్ద ఆస్థి అవుతుంది గుర్తుంచుకోండి. భావితరాలకు మంచి నీళ్ళని ప్రాణధారలుగా అందిద్దాం. వృధా నీటిని అరికడదాం మంచి నీటిని పొదుపుగా వాడుకుందాం. నీళ్ళ కోసం గొడవలు పడి కోర్టుల్లో నలుగుతున్న విషయాలు తెలుసుకోండి. నీటిని ప్రకృతి సహజ వనరుగా, దైవమిచ్చిన ఉచిత ప్రసాదంగా భావించి నీటిని పొదుపుగా వాడుకుందాం. 
‎భగవద్గీత లో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన 
‎""అన్నాద్భవంతి భూతాని
‎పర్జన్యాదన్న సంభవః 
‎యజ్ఞాద్భవతి పర్జన్యో
‎యజ్ఞః కర్మసముద్భవః "" అనే శ్లోకాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి. అన్నము మేఘము వలన కలుగుచున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది అని శ్లోకార్థం. అన్నం కావాలంటే పంటలు పండాలి. పంటలు పండాలంటే మేఘాలు, మేఘాలు వలన వర్షం, వర్షం నుంచి నీరు రావాలి. అలా వచ్చే స్వచ్ఛమైన నీరు ప్రాణులందరికీ లభించాలంటే ఇప్పటికైనా మేల్కొందాం.
‎పొదుపుగా నీటిని వాడుకుందాం. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా నేడే  కృషి చేద్దాం  
‎చివరిగా సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన నీటిని అందించే సర్వ నదీమతల్లులను స్మరిస్తూ, ఆ నదుల స్వరూపమైన గంగా మాతకు నమస్కరిద్దాం "గంగాయై నమః" అంటూ.... 
‎రచన :: - అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 
‎                 సెల్ :: :: 8247433432
‎
‎